సమాచారానికి సంకెళ్లు..

అన్నింటా సెన్సార్‌షిప్‌ విధిస్తున్న మోడీ సర్కార్‌
– ఐటీ నిబంధనలు..ఆర్టీఐ చట్టాల్లో మార్పులు
– పార్లమెంట్‌ ఆమోదించకున్నా..’ఐటీ నిబంధనలు, 2021’తో ఆదేశాలు
– డిజిటల్‌, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలకు బెదిరింపులు
– సందేశాలు, వీడియోలు తొలగించాలంటూ ఆదేశాలు
– బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా కరెంట్‌ కట్‌..నిషేధాజ్ఞలు
తాము మెచ్చింది..తమకు నచ్చిందే ప్రజలు తెలుసుకోవాలని..చూడాలని మోడీ సర్కార్‌ బలంగా భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక సమాచారం బయటకు రాకుండా ఆంక్షలు విధిస్తోంది. చట్టాల్ని మార్చుతోంది. ‘సెన్సార్‌షిప్‌’ను అమల్లోకి తెస్తోంది. ఐటీ నిబంధనలు(సవరణ)-2021 ముసాయిదా బిల్లును పార్లమెంట్‌ ఆమోదించలేదు. అయినా అందులోని ‘అత్యవసర అధికారాల్ని’ ప్రయోగిస్తూ ‘బీబీసీ డాక్యుమెంటరీ’ని కేంద్రం నిషేధించింది. ఇండియా : ద మోడీ క్వశ్చన్‌..ప్రసారం చేయవద్దని బీబీసీ అధికారిక వర్గాల్నే బెదిరించింది. ట్విట్టర్‌, యూట్యూబ్‌ల్లో ప్రసారం కాకూడదంటూ ఆదేశాలు జారీచేసింది.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త బయటకు రాకుండా మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున అధికార వ్యవస్థల్ని రంగంలోకి దించుతోంది. రాజకీయ, అధికార బలాన్ని, ప్రభుత్వ పరపతిని వినియోగిస్తోంది. ‘సెన్సార్‌షిప్‌’ అనేక రూపాల్లో, విధానాల్లో అమలవుతోంది. అత్యంత కీలక సమాచారమంటూ కోర్టులకు సీల్డ్‌ కవర్లలో అధికారిక సమాచారాన్ని ఇవ్వటం దగ్గర్నుంచి…వర్సిటీల్లో 144 సెక్షన్‌ విధింపు వరకు ఇదీఅదీ అన్న తేడా లేదు. ఎక్కడికక్కడ కఠినమైన ఆంక్షలు, సెన్సార్‌షిప్‌ విధించటమే ముఖ్య విధానంగా మోడీ సర్కార్‌ పాలన కొనసాగుతోంది. పాలకులకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయటం అందులో ఒకటి. కాశ్మీర్‌ జర్నలిస్టు ఆసిఫ్‌ సుల్తాన్‌ను ఆగస్టు 2018 నుంచి జైల్లో నిర్బంధించారు. బీబీసీ డాక్యుమెంటరీని బయటకు రాకుండా, ప్రదర్శించకుండా కేంద్రం చేయని ప్రయత్నం లేదు. వర్సిటీల్లో ఈ వీడియో ప్రదర్శనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపింది. విద్యార్థి సంఘాలపైకి పోలీసుల్ని ఉసిగొల్పింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేడుక జరుపుకుంటున్నవేళలో, మరోవైపు ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా, ఢిల్లీ యూనివర్సిటీ, చండీగఢ్‌.. అనేక వర్సిటీల్లో డాక్యు మెంటరీ ప్రదర్శనలను కేంద్రం అడ్డుకుంది. క్యాంపస్‌ కేంద్రాల వద్ద విద్యుత్‌ సరఫరా, వైఫై ఇంటర్నెట్‌ నిలిపివేసింది. పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించి.. విద్యార్థుల్ని భయ భ్రాంతులకు గురిచేస్తోంది. ఇదంతా చూస్తే..దేశంలో ప్రజాస్వామ్య పాలన ఉందా? అనే సందేహం కలుగుతోంది. ప్రధాని మోడీ ఒక నియంతలా దేశాన్ని ఏలాలని తపనపడు తున్నారు.
ఆర్టీఐ చట్టానికి తూట్లు
ఆర్టీఐ సమాచారం పౌరులకు ఒక ఆయుధంగా మారుతోందన్న భయం మోడీ సర్కార్‌ను వెంటాడుతోంది. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ సమాచారం పౌరులకు చేరటం అన్నది కేంద్రంలోని పాలకులకు సహించటం లేదు. భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ‘ప్రాథమిక హక్కుల’ను సైతం బలహీనం చేయాలన్న వ్యూహంతో వెళ్తోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను ఇప్పటికే చాలావరకు దెబ్బతీసింది. ‘ఆర్టీఐ’ పంటి కింది రాయిగా మారిందని భయపడుతోంది. దాంతో ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ.. బలహీనం చేయటమే పనిగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల వద్ద మూడు లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
కొత్త ఐటీ నిబంధనలు
ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా సంస్థల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ‘ఐటీ నిబంధనలు, 2021’ని తెరపైకి తెచ్చింది. ఇందులోని పలు నిబంధనల్ని చూపుతూ బెదిరిస్తోంది. ఇందులోని ‘అత్యవసర అధికారాలు’ అనేది ప్రయోగిస్తూ ‘బీబీసీ డాక్యుమెంటరీ’పై కేంద్రం నిషేధ ఉత్తర్వులు జారీచేసింది. దాంతో ఈ వీడియో, వాటి లింకులు, స్పందనలు.. అన్నింటినీ ట్విట్టర్‌, యూట్యూబ్‌ తొలగించాల్సి వచ్చింది. తొలగించిన వాట్లో ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ ట్వీట్‌ కూడా ఉంది. వాస్తవానికి కొత్త ఐటీ నిబంధనలు, 2021..ఒక ముసాయిదా బిల్లు మాత్రమే. అయితే ఇది పార్లమెంట్‌ ముందుకు రాకుం డానే, పార్లమెంట్‌ సమీక్షించకుండానే అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ సమాచారం ఫేక్‌ అని ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో’ గుర్తిస్తే, ఇక దానిని మీడియా సంస్థలు ప్రసారం చేయరాదంటూ కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్‌, టెలి కమ్యూనికేషన్‌ శాఖ హడావిడి చేస్తోంది ఈ వ్యవహారంపై దేశంలోని పలు మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముసాయిదా బిల్లులోని వివాదాస్పద అంశాల్ని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశాయి.