సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు

           చాలా మంది మహిళలకు సోషల్‌ మీడియా అంటే భయం… ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఎంతో మంది మహిళలు సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తమ భావాలను పంచుకుంటున్నారు. అంతేకాదు సమాజాన్ని సైతం ప్రభావితం చేసే వారు ఉన్నారు. వారు పెట్టే సందేశాలు ప్రేక్షకులపై సానుకూల ప్రభావాన్ని కలిగించగలిగితే అవి విస్తృతమైన మార్పులను తీసుకురాగలుగుతాయి. సాధారణంగా జనాదరణ పొందిన వారు, లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నవారు ఎప్పుడు, ఏం చెబుతారా అంటూ చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారు సోషల్‌ మీడియా ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయడం కాస్త సులువవుతుంది. అందుకే కొంత మంది తమకున్న అలాంటి శక్తితో బాడీ పాజిటివిటీ, లైంగిక ఆరోగ్యం, బాలికల విద్య, మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తమవంతు కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో ఓ ఐదుగురు మహిళల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం…
ప్రజక్త కోలి
యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యంత ప్రచారం పొందిన ప్రముఖ నటి, చేంజ్‌ మేకర్‌ ప్రజక్తా కోలీ. ఈమె ఇటీవల దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌లో ఆరు దేశాల నుండి ప్రభావశీలులలో ఒకరిగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. గత సంవత్సరం ప్రజక్త యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఇండియా (UNDP) యూత్‌ క్లైమేట్‌ ఛాంపియన్‌గా ఎంపికైంది. సంవత్సరాలుగా ప్రజక్తా తన ప్రచారంలో భాగమైన #IPledgeToBeMeతో షేమ్‌లెస్‌తో బాడీ షేమింగ్‌, ఆన్‌లైన్‌ బెదిరింపులను ఎదుర్కొంటూ సామాజిక సమస్యలకు క్రియాశీల ప్రచారకర్తగా ఉన్నారు. మార్పు కోసం కృషి చేసే యూట్యూబ్‌ సృష్టికర్తలకు ప్రపంచ అంబాసిడర్‌గా, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహనం దినోత్సవం సందర్భంగా ”నో అఫెన్స్‌”ను ప్రదర్శించి తద్వారా ట్రోలింగ్‌ చేస్తూ స్త్రీలను అవమానపరచడంపై, స్వలింగసంపర్కంపై తన గళం విప్పారు. అంతేకాదు సోషల్‌ ఇంపాక్ట్‌ గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ క్యాంపెయిన్‌ కోసం యూట్యూబ్‌తో కలిసి సురక్షితమైన ఇంటర్నెట్‌ వీక్‌ క్యాంపెయిన్‌ కోసం, ఇన్‌స్టాగ్రామ్‌తో కలిసి గర్ల్‌ ఎడ్యుకేషన్‌ క్యాంపెయిన్‌ కోసం One.orgతో కూడా ఆమె భాగస్వామిగా ఉన్నారు.
సెజల్‌ కుమార్‌
సెజల్‌ 19 సంవత్సరాల వయసులో యూట్యూబర్‌గా మారారు. రెండు మిలియన్లకు పైగా అనుచరులతో ఆమె ప్రజక్తా కోలి, మిచెల్‌ ఒబామా వంటి వారితో కలిసి యూట్యూబ్‌ క్రియేటర్స్‌ ఫర్‌ చేంజ్‌ ప్రోగ్రామ్‌లో చేరిన ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మంది సృష్టికర్తలలో ఒకరిగా నిలిచారు. కంటెంట్‌ సృష్టికర్త యునిసెఫ్‌తో కలిసి పిల్లల రక్షణ ప్రచారంలో కలిసి పనిచేశారు. భారతదేశంలో గేట్స్‌ ఫౌండేషన్‌ టీకా డ్రైవ్‌లో భాగంగా ఉన్నారు. మార్పు కోసం యూట్యూబ్‌ క్రియేటర్స్‌లో భాగమైన ఐసి హన్‌ (నేనే నేనే) అనే మహిళా సాధికారత ఉద్యమాన్ని కూడా ఆమె ప్రారంభించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు, దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యం గురించిన విశ్వసనీయ సమాచారం పెరగడానికి ఆమె గైనకాలజిస్ట్‌ అయిన తన తల్లితో కలిసి మైత్రి అనే సంస్థను స్థాపించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సీమా ఆనంద్‌
అరవై ఒక్క ఏండ్ల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 7,52,000 మంది ఫాలోవర్లతో లైంగిక ఆరోగ్య విద్యావేత్తగా ఉన్నారు. సీమ దాన్ని ప్రారంభించినప్పుడు సాధారణ వ్యాఖ్యాతలుగా పురుషులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ వేదికను పాలించేది మహిళలే. రెండు సంవత్సరాలలో ఆమె మహిళలు తమలోని భావాలను సిగ్గుపడకుండా చెప్పుకునేలా, తమ లైంగికతపై నమ్మకంగా ఉండేలా కృషి చేశారు. ఆనందాన్ని పొందే హక్కు కేవలం పురుషుడిదే అని భావించే మన దేశంలో స్త్రీలలో కూడా లైంగిక మేల్కొలుపు అనేది స్వాగతించదగిన మార్పు అని సీమా అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో సీమా ఎన్నో అవమానాలను ఛేదించారు. వృద్ధులకు సెక్స్‌, సెక్స్‌ ఎడ్యుకేషన్‌తో పాటు లైంగిక ఆరోగ్యంలోని విభిన్న అంశాల గురించి చాలా చిట్కాలను పంచుకుంటున్నారు.
దివిజ భాసిన్‌
మీరు మానసిక ఆరోగ్యంపై సాధారణ సమాచారం, సలహా కోసం చూస్తున్నట్టయితే మీరు తప్పనిసరిగా @awkwardgoat3, మనస్తత్వవేత్త దివ్య భాసిన్‌ నడుపుతున్న ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని చూడాల్సిందే. సంబంధిత సమాచారాన్ని అందించడం, మానసిక ఆరోగ్యం గురించి సాధారణ అపోహలను తొలగించడం ఆమె లక్ష్యం. అంతే కాదు ఆమె ఇతర సామాజిక అంశాలను తీసుకుంటున్నారు. శరీర రకాలను సాధారణీకరించడం, అమ్మాయిలు సహజంగా కనిపించడం వంటి ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే వివిధ మోడ్‌ల చుట్టూ ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇది ఎలా పని చేస్తుంది, ఎందుకు ఖరీదైనది, ఆన్‌లైన్‌ థెరపీతో పాటు ఇతర సంబంధిత ఆందోళనలు, ప్రశ్నలకు సంబంధించిన చికిత్స కోసం ఆమె QడAని ఒక్క సారి పరిశీలించండి. దివిజ అందరికీ అర్థమయ్యేలా, అందరికీ సంబంధించిన భాషలో ముఖ్యమైన సమాచారాన్ని అందులో పెడతారు. ఈ విషయమే అందరినీ ఆకర్షిస్తుంది. ఏ ప్రశ్న కూడా అసంబద్ధం ఉంది, అనవసరంగా ఉంది, చిన్నగా ఉంది, పెద్దగా ఉంది అనే భావనే ఎవరికీ కలగదు.
ప్రబ్లీన్‌ కౌర్‌ భోమ్రా
ప్రబ్లీన్‌కు యుక్తవయసులో ఉన్నప్పుడు PCOS ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఫలితంగా ఆమె తీవ్రమైన మొటిమలను ఎదుర్కోవలసి వచ్చింది. దాంతో ఆమె సోషల్‌ మీడియాలో ఎన్నో అవమానాలను భరించాల్సి వచ్చింది. అయితే ఆ విమర్శను ఆమె విమర్శలను అధిగమిస్తుంది. తన ప్రేక్షకులతో తాను సహజంగా ఉండాలని నిర్ణయించుకుంది. #nofilterwithpkb అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె తన మొదటి చిత్రాన్ని పోస్ట్‌ చేసింది. అది వైరల్‌గా మారడంతో అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. తన నిజమైన స్వభావాన్ని ఆలింగనం చేసుకుంటూ, తన చర్మం, శరీరం సానుకూలంగా ఉండేలా ఇతరులను కూడా ప్రోత్సహిస్తోంది. గతంలో ఓ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రబ్లీన్‌ ”ప్రణాళిక పరంగా, నా దగ్గర స్థిరమైన కంటెంట్‌ క్యాలెండర్‌ లేదు. నా మానసిక స్థితి, ఆ సమయంలో నేను ఏమి మాట్లాడాలనుకుంటున్నాను అనే దానిపై ఆధారపడి నా ఆలోచనలు యాదృచ్ఛికంగా ప్రవహిస్తాయి. స్కిన్‌, బాడీ పాజిటివిటీ, మేకప్‌, ఫ్యాషన్‌ల మధ్య బ్యాలెన్స్‌ని ఉంచుకోవడం నాకు ఇష్టం” అన్నారు.
– సలీమ