సాగునీటి కోసం.. అర్ధరాత్రి పడిగాపులు

 – నిజాంసాగర్‌ కాలువ వద్ద వంతు కోసం రైతుల పాట్లు
– సరిపడా సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌
– కరెంట్‌ లేక బోర్లూ పోయడం లేదని ఆవేదన
           విత్తనం నాటింది మొదలు పంట చేతికి వచ్చేంతవరకూ రైతులు పడే కష్టం ఇంతా అంతా కాదు. పంటను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ డివిజన్‌లో నిజాంసాగర్‌ కాలువ నీటి కోసం రైతులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాస్తున్నారు. సాలూర మండలం సాలూర క్యాంప్‌ శివారులో నిజాంసాగర్‌ కెనాల్‌ పరిధిలోని సబ్‌ డివిజన్‌ 14వ నెంబర్‌ కెనాల్‌ సాలుర క్యాంప్‌, జాడి జమాల్‌ పూర్‌, ఫతేపూర్‌ వద్ద పంటలకు సాగునీటి వనరు.

 నవతెలంగాణ-బోధన్‌ : కానీ పంటలకు సరిపడా నీరు అందక పంటలు తడుపుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. తమ వంతు కోసం అర్ధరాత్రి వేళ కాలువ వద్ద పడిగాపులు కాస్తున్నారు. విష పురుగులు ఉన్నా పంటల కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. కాలువల వద్దనే రైతుల నిద్ర రైతులు తాము వేసిన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి పంటలకు సరిపడా సాగునీరు అందించడానికి నిజాం సాగర్‌ కెనాల్‌ వద్ద రాత్రి, పగలు పడిగాపులు కాస్తున్నారు. కనీసం బోరునీటితోనైనా నీటిని పారిద్దామనుకుంటే కరెంట్‌ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. రోజుకు ఉదయం అయిదారు గంటలు, రాత్రి ఐదారు గంటలు మాత్రమే కరెంటు వస్తుందని, ఆ సమయంలో పంటలకు సాగు నీరు అందిస్తున్నామని రైతులు తెలిపారు. అది కూడా సరిపోక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ నెల 2వ తేదీ నుంచి విడుదల చేస్తున్న నిజాంసాగర్‌ నీటిని 12వ తేదీతో నిలిపివేయనున్నట్టు అధికారులు చెప్పారనీ, ఆ తేదీని మరో ఐదు రోజులు పొడిగించాలని, దాంతో పంటలకు సరిపడా సాగునీరు అందే అవకాశం ఉందని రైతులు తెలిపారు. పంటలు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయని సాగునీరు అందకుంటే వేలాది రూపాయల పెట్టుబడులు నష్టపోయి మరింత అప్పులు అయ్యే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్‌లో చెత్త చెదారం.. నీటి సరఫరాకు అంతరాయం కాలువలకు నీటి సరఫరా చేసే ముందు కాలువలను పరిశీలించి చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు తొలగించాల్సి ఉంటుంది. అప్పుడే కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే అవకాశం ఉంది. కానీ అధికారులెన్నడూ కాలువల స్థితిగతులు పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కెనాల్‌లో కనీసం పూడికతీత పనులు చేయకపోవడంతో చివరి ఆయకట్టు పరిధిలోని రైతుల పొలాలకు నీరు అందే అవకాశం లేకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువల్లో చెత్తా చెదారం తొలగించాలని రైతులు కోరుతున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం – లక్ష్మీనారాయణ రైతు, సాలూర క్యాంపు పంటలకు సాగునీరు అందించడానికి నిజాంసాగర్‌ కెనాల్‌ 14వ నెంబర్‌ కెనాల్‌ వద్ద రాత్రంతా అక్కడే పడిగాపులు కాస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. 12వ తేదీ నుంచి నీటిని నిలిపివేస్తామని అంటున్నారు.. ఇలా చేస్తే మా పంటలకు సరిపడా నీరు అందదు. ప్రస్తుతం పంటలు పొట్ట దశలో ఉన్నందున మరో ఐదు రోజులు నిజాం సాగర్‌ నీటిని పొడిగించాలి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 24 గంటలు కరెంటు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి. పై నుంచి ఆదేశాలు రాలే.. – శృతి, ఏఈ, ఇరిగేషన్‌ కాలువకు నీటి విడుదల గడువు పొడిగింపు 12వ తేదీ వరకే ఉంది. రైతుల అభ్యర్ధన మేరకు పొడగించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేవు. కాలువలో పూడిక తీత తీసేందుకు గ్యాంగ్‌మెన్లు లేరు. ఉపాధి హామీలో భాగంగా పూడిక తీత పనులు చేయించాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లకు, మండలాధికారులకు గతంలోనే సూచించాం.