సింగరేణిలో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం

 పూర్తి దేశీయ టెక్నాలజీతో ఏర్పాటు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం జలాశయంలో నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్‌ను ఆ సంస్థ డైరెక్టర్‌ డీ సత్యనారాయణరావు ప్రారంభించారు. 5 మెగావాట్ల ఈ ప్లాంట్‌ విద్యుదుత్పత్తిని టీఎస్‌ ట్రాన్స్‌కోకు అనుసంధానం చేశారు. దీనితో సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం 224 మెగావాట్లకు చేరింది. ఈ ప్లాంట్‌ ప్రారంభంపై సంస్థ చైర్మెన్‌ ఎన్‌ శ్రీధర్‌ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇదే జలాశయంపై ఏర్పాటు చేసే మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సింగరేణి ఆధ్వర్యంలో రెండేండ్లలో మూడు దశల్లో 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్లను మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, రామగుండం-3, మందమర్రి ఏరియాల్లో నిర్మించి ప్రారంభించారు. ఈ ప్లాంట్లు అన్నీ సమర్థవంతంగా పనిచేస్తూ ఇప్పటి వరకు 540 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, కంపెనీకి దాదాపు రూ.300 కోట్లు ఆదా చేశాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన తొలి ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ఇదే. దీని డిజైన్‌ను దేశీయంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూపొందించింది.