సినీ పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోతారు

– గవర్నర్‌, సీఎం సహా పలువురి సంతాపం
– ఆణిముత్యాలను అందించారు :తమ్మినేని
– పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించారు : కూనంనేని
సినీ పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోతారు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కళాతపస్వి, ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్‌ మరణం పట్ల రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌, సీఎం కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తన ప్రతిభాపాటవాలతో చిత్రరంగంపై గొప్ప ముద్ర వేసిన దర్శకుడిని సినీ పరిశ్రమ కోల్పోయిందని తమిళిసై విచారం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు, ప్రత్యేకించి తెలుగు సినిమాకు విశ్వనాథ్‌ అందించిన సేవలు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం గుర్తిండిపోతాయని నివాళులర్పించారు.అతి సామాన్యమైన కథలను ఎంచుకుని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్‌ అని సీఎం కొనియాడారు. గతంలో ఆయన్ను పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక, సంస్కృతి, సంప్రదాయ విలువలకు విశ్వనాథ్‌ తన సినిమాలో పెద్ద పీట వేశారని తెలిపారు. సంగీత, సాహిత్యాలను ప్రధాన ఇతివృత్తాలుగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె విశ్వనాథ్‌ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు టి.హరీశ్‌ రావు, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరవింద్‌ కుమార్‌, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ తదితరులు కళాతపస్వి మరణం పట్ల సంతాపం తెలిపారు.
విశ్వనాథ్‌ మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం తదితర గొప్ప చిత్రాలతో పాటు సామాజిక సమస్యలను ఎత్తిచూపే సప్తపది, శుభలేఖ, స్వయంకృషి లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి సినిమాలను ప్రజలకందించిన ఆయన ప్రేక్షకుల్లో విశేష గౌరవాన్ని పొందారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు. సినీ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్న విశ్వనాథ్‌ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలను రూపొందించారని పేర్కొన్నారు. ఆయన మరణం బాధాకరమనీ, సినీ, సాహిత్య, కళారంగాలకు తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఆయన మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంతాపాన్ని తెలిపారు. సాహిత్యం, లలిత కళలు, సంగీతం, నాట్యం తదితర అంశాల ద్వారా సినీరంగాన్ని విశ్వనాథ్‌ కొత్త పుంతలు తొక్కించారని పేర్కొన్నారు. అనేక మంది దిగ్గజ దర్శకులకు ధీటుగా పాత, కొత్త తరం దర్శకులకు వారధిగా ఆయన పని చేశారని నివాళులర్పించారు.