సుప్రీం సమర్ధించిందని భావించలేం  సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు ఈ చర్యను న్యాయ స్థానం సమర్ధించినట్లగా భాష్యం చెప్పలేమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చర్యపై 4:1 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు, ఇటువంటి నిర్ణయం తీసుకునే చట్టబద్ధమైన హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వుందంటూ దాన్ని ప్రత్యేకంగా పరిగణించింది. 1934 నాటి ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 26(2)ను ఇది ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. అయితే పెద్ద నోట్ల రద్దును చేపట్టాలని ఆర్‌బీఐ, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలంటూ ఆర్‌బీఐ చట్టంలోని ఈ సెక్షన్‌ పేర్కొంటోందంటూ సుప్రీం న్యాయమూర్తుల్లో ఒకరు వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆర్‌బీఐ అభిప్రాయాన్ని కోరిన కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్ల, ఈ నిర్ణయం అమలు చేయడానికి ముందుగా పార్లమెంట్‌ ఆమోద ముద్రను తీసుకోవాల్సి వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి, ఆ చర్య వల్ల సాధించాలనుకున్న లక్ష్యాలకు మధ్య సహేతుకమైన సంబంధముందని మెజారిటీ తీర్పు వ్యాఖ్యానించింది. అయితే, ఈ లక్ష్యం నెరవేరిందా లేదా అనేదానితో సంబంధం లేదని పేర్కొంది. ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి చట్టబద్ధమైన హక్కు వుందని సమర్ధిస్తూ ఇచ్చిన ఈ మెజారిటీ తీర్పు, ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రభావం గురించి అస్సలు మాట్లాడలేదు. ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కోట్లాదిమంది ప్రజలకు ఉపాధి కలిగించే దేశ అసంఘటిత రంగం తీవ్రంగా విధ్వంసానికి గురైంది. చిన్న తరహా పారిశ్రామిక రంగాన్ని స్తంభింపజేసింది. కోట్లాదిమంది జీవనోపాధులను దెబ్బతీసింది. 2016లో ఈ నిర్ణయం తీసుకున్న ఒక నెలలోనే 82మంది తమ ప్రాణాలు కోల్పోయారని వార్తలందాయి. పైగా, నల్ల ధనాన్ని వెలికి తీయడం, విదేశీ బ్యాంక్‌ల నుండి ఆ మొత్తాలను వెనక్కి రప్పించడం, నకిలీ కరెన్సీ సమస్యను తుదముట్టించడం, తీవ్రవాదానికి నిధులు అందకుండా చేయడం, అవినీతిని నిర్మూలించడం, ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణిని తగ్గించడమన్నవి ఈ వినాశకర నిర్ణయాన్ని సమర్ధిస్తూ పేర్కొన్న లక్ష్యాలని, కానీ వాటిల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. దీనికి విరుద్ధంగా, ప్రజల్లో చలామణిలో వున్న కరెన్సీ, పెద్ద నోట్ల రద్దు సందర్భంగా రూ.17.7లక్షల కోట్ల నుండి ఇప్పుడు రూ.30.88 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్‌బిఐ పేర్కొంది. అంటే 71.84శాతం పెంపు నమోదైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు, ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి గల హక్కును మాత్రమే సమర్ధించింది, అంతేకానీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తలెత్తే పర్యవసానాలను ఏ రకంగానూ సమర్ధించలేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది.