సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు కావడం లేదు

– ఛండీగఢ్‌లో ఎయిడెడ్‌ కాలేజీల సిబ్బంది ఆందోళన
ఛంఢగీఢ్‌: సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు కావడం లేదంటూ పంజాబ్‌ యూనివర్సిటీకి చెందిన ఏడు ఎయిడెడ్‌ కాలేజీల సిబ్బంది ఆందోళనకు దిగారు. గురువారం ప్రారంభమైన ధర్నా ఈ నెల 8 వరకూ జరగనుంది. ఏడు ఎయిడెడ్‌ల కాలేజీలకు చెందిన సుమారు 750 మంది ఉపాధ్యాయులు, 400 మంది బోధనేతర సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. దీంతో ఈ ఏడు కాలేజీల్లో ఉన్న సుమారు 50 వేల మంది విద్యార్థులపై ఈ ఆందోళన ప్రభావం పడింది. ఛంఢగీఢ్‌లో ఉద్యోగులకు సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తామని గత ఏడాదిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. గత ఏడాది ఏప్రిల్‌లో దీనిపై నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వ కళాశాలను సివిల్‌ సర్వీస్‌ నిబంధనల పరిధిలోకి తీసుకుని వచ్చారు. అయితే ఎయిడెడ్‌ కళాశాలలను దీనికి దూరంగా ఉంచారు. అప్పటి నుంచి ఎయిడెడ్‌ కళాశాల సిబ్బంది కూడా దీనికోసం విజ్ఞప్తి చేస్తున్నారు. జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎయిడెడ్‌ కాలేజీలకు కూడా ఈ రూల్స్‌ అమలు చేస్తామని గత ఏడాది మార్చిలో అమిత్‌ షా హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు విస్మరించారని డిఎవి కళాశాల ప్రోఫెసర్‌ సుమిత్‌ గోఖ్లానీ విమర్శించారు. అలాగే పదవీవిరమణ వయస్సును 58 నుంచి 60 ఏండ్లకు పెంచే మార్పు నియమాన్ని చాలా అస్పష్టత, గందరగోళంగా మార్చి వేశారు. దీంతో గత ఏడాది మే నుంచి తన నెలవారీ జీతాన్ని అందుకోలేదని పంజాబ్‌ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ నీలా తెలిపారు. ఈ ధర్నాలో లైబ్రరియన్లు, కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌, లాబ్‌ టెక్నీషియన్‌ వంటి బోధనేతర సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఆరో పే కమిషన్‌ను అమలు చేయాలని కూడా వీరంతా కోరుతున్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కావడంతో చంఢగీఢ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. అమిత్‌ షా హామీ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేయక ముందు ఇక్కడ ఉద్యోగులకు పంజాబ్‌ సర్వీస్‌ రూల్‌ను అమలుచేసేవారు. మే ప్రస్తుతం ఏ సర్వీస్‌ రూల్‌ పరిధలో ఉన్నామో.. మాకు తెలియదని శ్రీగురుగోవింద్‌ సింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ సందీప్‌ కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్‌ సర్వీస్‌ రూల్‌ నుంచి మమ్మల్ని వేరు చేశారని, మరో వైపు కేంద్ర మమ్మల్ని పూర్తిగా తీసుకోలేదని.. సుమారు 10 నెలల నుంచి ఇదే గందరగోళం నడుస్తుందని, నిజానికి మేం సెలవులు కూడా తీసుకోవడం లేదని..ఎందుకంటే మేం పంజాబ్‌ పరిపాలన కిందకు వస్తామో.. లేదా సెంట్రల్‌ లీవ్‌ షెడ్యూల్‌ కిందకు వస్తామో అధికారులకే తెలియదని సందీప్‌ కౌర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8 తరువాత కూడా విద్యాశాఖ నుంచి స్పందన రాని పక్షంలో నిరసనను మరింత ఉధృతం చేయాలని సిబ్బంది భావిస్తున్నారు. ఈ ధర్నా కారణంగా ఏడు కాలేజీల్లో విద్యా, పరిపాలన కార్యక్రమాలు పూర్తిగా స్థంభించిపోయాయి. ఈ అంశంపై ఉన్నతాధికారులతో సంప్రదించడానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా అధికారులు స్పందించడం లేదు.