హిమాయత్‌నగర్‌లో కుంగిన రోడ్డు

– గుంతలో ఇరుక్కుపోయిన టిప్పర్‌
– డ్రైవర్‌తో పాటు ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలు
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
ఇటీవల హైదరాబాద్‌లోని గోషామహల్‌ చట్నీ వాడి ఘటన మరవక ముందే నగరంలో మరో చోట రోడ్డు కుంగిపోయింది. హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నెంబర్‌ 5లో గల ప్రధాన రోడ్డు శనివారం సాయంత్రం ఒక్క సారిగా కుంగి పోయింది. అదే సమయంలో మట్టి లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ గుంతలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో టిప్పర్‌ డ్రైవర్‌, ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, వారిని ఆస్పత్రికి తరలించారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది కలిసి క్రేన్‌ సహాయంతో టిప్పర్‌ను బయటకు తీశారు. అటుగా వాహనాల రాకపో కలను నిలిపివేశారు. నాణ్యత లేని రోడ్ల నిర్మాణం వల్లే తరచూ నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.