10న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం!

హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్‌ కూడా స్పీడు పెంచారు. ఈ క్రమంలో ఈ నెల 10న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, రుణాల సేకరణకు కొర్రీలు వేస్తోందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణాల్లో కోత, పథకాలకు నిధులు ఇవ్వకపోవడం, విభజన హామీలు నెరవేర్చకపోవడం, కృష్ణా జలాల విభజనలో జాప్యం సహా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణ జీఎస్డీపీకి రూ.3 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కేసీఆర్‌ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను వాడుకోవడంపైనా చర్చించనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తీరుపై చర్చించడంతో పాటు ఆమె అధికారాలకు కత్తెర వేసే అంశాన్ని పరిశీలించనున్నారు. పలు బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్‌ వ్యవస్థపై అసెంబ్లీలో చర్చించడంతో పాటు వర్సిటీల చాన్స్‌లర్‌గా ఆమెను తప్పించేందుకు బిల్లు ప్రవేశపెట్టడంపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే గవర్నర్లను చాన్స్‌లర్లుగా తప్పిస్తూ తీర్మానాలు చేసిన సంగతి తెలిసిందే.