నిరుపేదలందరికీ 125 గజాల స్థలం ఇవ్వాలి

– తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలందరికీ వెంటనే 125 గజాల స్థలం ఇవ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి జగిత్యాల జిల్లాకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని వాణినగర్‌, ఎస్సారెస్పీ చిన్న కెనాల్‌ పక్కన వడ్డెరా, బుడగ జంగాలు గుడిసెలు వేసుకున్న ప్రాంతాన్ని నాయకులు సందర్శించారు. గుడిసెవాసులు, పేదలు బోనాలు, బతుకమ్మలతో యాత్ర బృందానికి స్వాగతం పలికారు. అనంతరం కోరుట్లలో నిర్వహించిన సభలో నేతలు మాట్లాడారు. జిగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణీనగర్‌, ఎస్పారెస్పీ చిన్న కెనాల్‌ పక్కన గుడిసెలు వేసుకుని కొన్నేండ్లుగా ఇక్కడే నివసిస్తున్న నిరుపేదలందరికీ 125గజాల ఇంటి స్థలం కేటాయించి, పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూ పోరాటంలో భాగంగా కోరుట్లలో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకోగా వారిపై పలుమార్లు దాడులు చేసి గుడిసెలను తొలగించి తగలబెట్టారని, 65 మందిపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. పది మందిపై లాఠీచార్జి చేసి గాయపరిచినా పేదలందరూ జంకకుండా పోరాడుతున్నారని తెలిపారు.
ఆ సమయంలో వర్షం కురిసినా లెక్కచేయకుండా సభ సాగగా.. పేదలు సైతం కదల్లేదు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక నాయకులు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌రాములు, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, వృత్తి సంఘాల రాష్ట్ర కో-కన్వీనర్‌ ఆశయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ పాల్గొన్నారు.