15 నుంచి టెన్త్‌ విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం

– రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.15 ఖర్చు
– 1.89 లక్షల మందికి రూ. 9.67 కోట్ల వ్యయం
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈ ఏడాది ఏప్రిల్‌ మూడు నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈనెల 15 నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు 34 పనిదినాలపాటు వారికి సాయంత్రం అల్పాహారం (స్నాక్స్‌) అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీదేవసేన శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మోడల్‌ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో అల్పాహారం కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 ఖర్చు చేస్తున్నామని వివరించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4,785 పాఠశాలల్లో 1,89,791 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. వారికి స్నాక్స్‌ కోసం రోజుకు రూ.28,46,865 ఖర్చవుతుందని తెలిపారు. ఆ చొప్పున 34 రోజులపాటు వారి కోసం రూ.9,67,93,410 ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నిధులను జిల్లా విద్యాశాఖాధికారు (డీఈవో)లకు విడుదల చేశామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 253 బడుల్లో 13,994 మంది విద్యార్థులకు రోజుకు రూ.2,09,910 ఖర్చు చేస్తున్నామనీ, 34 రోజులకు రూ.71,36,940 వ్యయం అవుతుందని వివరించారు. సంగారెడ్డి జిల్లాలో 218 పాఠశాలల్లో 10,593 మంది విద్యార్థులకు రోజుకు రూ.1,58,895 ఖర్చవుతుందనీ, 34 రోజులకు రూ.54,02,430 వ్యయం చేస్తున్నామని తెలిపారు. అప్పటికప్పుడు వండి వేడిగా ఉండే పౌష్టికాహారాన్ని విద్యార్థుల కు అందించాలని డీఈవోలను ఆదేశించారు.
స్వాగతించిన టీఎస్‌యూటీఎఫ్‌
పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం కోసం విద్యాశాఖ నిధులు విడుదల చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ స్వాగతించింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలంటూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. అందులో భాగంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.