లాంగ్‌జంప్‌ దూరాన్ని తగ్గించాలి

– ఎత్తు కొలతలను మ్యానువల్‌గా తీసుకోవాలి ొ డీజీపీ కార్యాలయంలో డీవైఎఫ్‌ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై నియామకాల్లో లాంగ్‌జంప్‌ దూరాన్ని తగ్గించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అభ్యర్థుల ఎత్తు కొలతలను మ్యానువల్‌గానే తీసుకోవాలని కోరింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏవో సంపత్‌ను డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌, పలువురు అభ్యర్థులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై నియామకాల్లో భాగంగా దేహదారుఢ్య పరీక్షలకు పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాల్లో భాగంగా దేహదారుఢ్య పరీక్షలో లాంగ్‌జంప్‌ 3.8 మీటర్ల నుంచి నాలుగు మీటర్లకు పెంచారని తెలిపారు, షాట్‌పుట్‌ 5.6 మీటర్ల నుంచి ఆరు మీటర్లకు పెంచారని పేర్కొన్నారు. దీని వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్‌ యంత్రాల ద్వారా ఎత్తు కొలిచే సందర్భంలోనూ సాంకేతిక లోపం వల్ల చాలా మంది అభ్యర్థులు అర్హత సాధించ లేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మ్యానువల్‌గా ఎత్తు కొలతలు తీసుకో వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లాంగ్‌జంప్‌ దూరాన్ని తగ్గించి పాత విధానాన్ని అమలు చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
డిమాండ్లు
– ఏడు బహుళ ప్రశ్నలకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తూ ఉత్తర్వులివ్వాలి.
– తొమ్మిదో ప్రశ్న ( కానిస్టేబుల్‌), ఏడో ప్రశ్న (ఎస్సై), తప్పు ప్రశ్నకి సంబంధించిన మార్కులు అందరికీ కలపాలి.
– లాంగ్‌జంప్‌కి సంబంధించి పురుషులకు నాలుగు మీటర్ల నుంచి 3.8 మీటర్లు, మహిళలకు 2.5 మీటర్ల నుంచి 2.2 మీటర్లకు తగ్గించి పాతపద్ధతిని కొనసాగించాలి.
– షాట్‌పుట్‌కి సంబంధించి పురుషులకు ఆరు మీటర్ల నుంచి 5.6 మీటర్లకు, మహిళలకు నాలుగు మీటర్ల నుంచి 3.75 మీటర్లకు కుదిస్తూ పాత పద్ధతిలోనే నిర్వహించాలి.
– 1600 మీటర్ల పరుగుపందెం అనంతరం రెండు గంటలు లేదా ఒక రోజు సమయం ఇచ్చి లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ నిర్వహించాలి.
– దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఇంతకు ముందు నోటిఫికేషన్‌లో ఫిజికల్‌ ఫిట్నెస్‌కి సంబంధం లేని పోస్ట్‌ అయిన కమ్యూనికేషన్‌, ఫైర్‌ మెన్‌, సివిల్‌ విభాగాల్లో బెస్ట్‌ ఆఫ్‌ రెండు ఈవెంట్లను అమలు చేయాలి.
– ఎస్సై, కానిస్టేబుల్‌ ఎంపికకు సంబంధించి వేర్వేరుగా దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించాలి.
– లాంగ్‌జంప్‌లో ఆన్‌ ద లైన్‌ జంప్‌ని కూడా అనుమతించాలి.
– ఎత్తుకు సంబంధించిన డిజిటల్‌ విధానాన్ని తీసేసి, పాత పద్ధతిలోనే మ్యానువుల్‌గా కొలతలను తీసుకోవాలి. ఈ డిమాండ్లను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జావెద్‌, అభ్యర్థులు జ్యోతి, విజయలక్ష్మి, నరేష్‌, సాయి, రాము, వేణు తదితరులు పాల్గొన్నారు.