2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు
నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బిఎన్‌ తిమ్మాపురం గ్రామ రైతులకు 2013భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. గ్రామ ప్రజలకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్‌ కట్టమీద 44 రోజులుగా దీక్షలు చేస్తున్న తిమ్మాపురం గ్రామ నిర్వా సితులకు వ్యకాస జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆర్‌.వెంకట్రాములు మాట్లాడుతూ.. తరాల నుంచి గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని అనేక కష్టనష్టాలకోర్చి జీవనం సాగిస్తున్నారనీ, ఇప్పుడు సర్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపురం నిర్వా సితులకు అండగా ఉండాల్సిందిపోయి ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గ్రామస్తులు 44 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గ్రామస్తులు భూములు, గూడు, ఆస్తులన్నీ ప్రాజెక్టుకు ఇవ్వకపోతే ఎలా కట్టగలరని ప్రశ్నించారు. తిమ్మాపురం గ్రామ నిర్వాసితులకు ఎకరానికి రూ.50 లక్షలు ఇచ్చినా తక్కువేనన్నారు. కూత వేటు దూరంలో ఉన్న జిల్లా కలెక్టర్‌కు నిర్వాసితుల బాధ తెలియడం లేదా, వారితో మాట్లాడటానికి తీరిక లేదా అని నిలదీశారు. ఇప్పటికైనా బస్వాపురం రిజర్వాయర్‌లో సర్వం కోల్పోతున్న తిమ్మాపురం గ్రామస్తులను అన్ని విధాలుగా ఆదుకోవాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలోని చదువుకున్న యువతీయువకులకు ఇరిగేషన్‌ డిపార్టుమెంటులో, యాదాద్రి టెంపుల్లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడారు. నిర్వాసితుల విషయంలో ఇప్పటికైనా అధికారులు స్థానిక ప్రజా ప్రతి రనిధులు, జిల్లా మంత్రి స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షకార్యదర్శులు అన్నంపట్ల కృష్ణ, సందెల రాజేష్‌, సర్పంచ్‌ పిన్నం లలిత రాజు, ఎంపీటీసీ ఉడత శారద ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.