ఆయన మరణం కూడా ముగింపు కాదు

దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర సంతాపాన్ని తెలిపారు.
జీవిత పరమార్థాన్ని, కళ సజీవమైనదని పూర్తిగా అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ అజరామరం. ఆయన తదనంతరం కూడా అది బతికే ఉంటుంది. – కమల్‌ హాసన్‌
ఇది అత్యంత విషాదకరమైన రోజు. పండితులని పామరులని కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్‌ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు ఆయన.   – చిరంజీవి
మన తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించేల ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణము..తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడు.  – బాలకష్ణ
నాకు సినిమాలంటే తెలియని సమయంలో.. పాశ్చాత్య పాటలను ఇష్టపడే నాకు మన శాస్త్రీయ సంగీతంపై మక్కువ పెరిగేలా చేశారు. యాక్షన్‌ సినిమాలంటే ఇష్టపడే నా దక్పథాన్ని శంకరాభరణం మార్చేసింది.    – పవన్‌ కల్యాణ్‌
సంస్కతి, సినిమాలను అద్భుతంగా కలగలిపిన జీనియస్‌ కె. విశ్వనాథ్‌ గారు. సినిమా ఉన్నంత కాలం ఆయన ప్రభావం ఉంటుంది.   – మహేష్‌బాబు
ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే.. మాకు కె.విశ్వనాథ్‌ గారు ఉన్నారని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమ మిమ్మల్ని ఎప్పటి మర్చిపోలేదు. సినిమా గ్రామర్‌లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాతం రుణపడి ఉంటాం సర్‌.  – ఎస్‌ఎస్‌ రాజమౌళి
విశ్వనాథ్‌ గారు ప్రతి సినిమా చివరిలో కళా కొనసాగుతూనే ఉంటుందంటారు. అలాగే ఆయన మరణం కూడా ముగింపు కాదు. ఆయన తాలుకు కళా వారసత్వానికి కొనసాగింపని అనుకుంటున్నాను.  – త్రివిక్రమ్‌