కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక

– పెరిగిన రాష్ట్ర ఆదాయం
– రెండంకెలకు చేరిన వృద్ధిరేటు
– కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు
– వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల కోసం రూ.1000కోట్లు
– కేరళ బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి బాలగోపాల్‌
తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలతో ఒత్తిళ్ళు పెరుగుతున్నప్పటికీ కేరళ సమగ్రాభివృద్ధికి అనుసరించే ప్రణాళికను ఆర్థిక మంత్రి కె.ఎన్‌.బాలగోపాల్‌ శుక్రవారం వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేరళ వార్షిక బడ్జెట్‌ను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ, ప్రకృతి విపత్తులు, కరోనా వంటి మహమ్మారులు విసిరిన సవాళ్ళన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగామని చెప్పారు. అభివృద్ధి రేటు రెండంకెలకు చేరుకుందనీ, 2012 తర్వాత ఇదే అత్యధికమని అన్నారు. అన్ని అడ్డంకులను, అవరోధాలను ప్రభుత్వం దాటగలిగిందని చెప్పారు. దుర్భర దారిద్య్రమనేది పూర్తిగా నిర్మూలించబడుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర స్వంత ఆదాయం పెరిగిందని, ఈ ఏడాది రూ.85వేల కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. రుణాల ఉచ్చులో రాష్ట్రం చిక్కుకోదని చెప్పారు. అవసరమైతే మరిన్ని రుణాలు తీసుకోవడానికి రాష్ట్రానికి ఇంకా అవకాశం వుందన్నారు. కేంద్రం అనుసరించే ఘర్షణాయుత వైఖరే రాష్ట్రానికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి బోర్డు (కేఐఐఎఫ్‌బీ) ఇప్పటివరకు రూ.22,801 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అయితే, రాష్ట్ర అభివృద్ధి కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న కేఐఐఎఫ్‌బీని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు రూ.2వేల కోట్లను కేటాయించామని చెప్పారు. రబ్బర్‌ సబ్సిడీకి రూ.600కోట్లు కేటాయించామన్నారు. రూ.1000 వరకు ధర వుండే లిక్కర్‌పై రూ.20ను సామాజిక భద్రతా సెస్‌గా విధించనున్నట్లు ప్రకటించారు. వెయ్యి రూపాయిల ధర దాటిన వాటిపై రూ.40 సెస్సు వుంటుందన్నారు. పెట్రోల్‌పై రూ.2ను సామాజిక భద్రతా సెస్‌గా విధిస్తున్నట్టు బాలగోపాల్‌ ప్రకటించారు. టెక్నో పార్క్‌లో కొత్త డిజిటల్‌ సైన్స్‌ విభాగం ప్రారంభించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లను ప్రారంభించేందుకు గానూ మేక్‌ ఇన్‌ కేరళ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లను కేటాయించినట్టు ప్రకటించారు. విజిళం రింగ్‌ రోడ్‌కు రూ.1000కోట్లు, విజిళం పోర్టు ప్రాజెక్టుతో సంబంధమున్న అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. వ్యవసాయాభివృద్ధి కోసం రూ.971కోట్ల ప్రాజెక్టును చేపడుతున్నట్టు తెలిపారు. కొబ్బరి కనీస మద్దతు ధరను రూ.2 పెంచారు. దాని ధరను రూ.34గా నిర్ధారించారు. కేరళ ఆర్‌టీసీకి రూ.3400కోట్లు కేటాయింపులు ప్రకటించారు.