6న రాష్ట్ర బడ్జెట్‌

– 8న పద్దులపై చర్చ… అదే రోజు బీఏసీ భేటీ
– 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెలవు
– బీఏసీలో నిర్ణయాలు
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్‌
రాష్ట్ర వార్షిక బడ్టెట్‌ (2023-24)ను సోమవారం ప్రవేశ పెట్టాలని బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసనమండలిలో సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పద్దులను ప్రతిపాదించనున్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినరు భాస్కర్‌, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభలు గవర్నర్‌కు ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. కాగా ఆది, మంగళవారం అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని బీఏసీ నిర్ణయించింది. 8న బడ్జెట్‌ పద్దులపై చర్చ ప్రారంభవుతుంది. బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై స్పష్టత రాలేదు. అందుకే 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని భట్టి విక్రమార్క కోరారు. కనీసం 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలన్నారు. బడ్జెట్‌పైనా, పద్దులపైనా చర్చ, ద్రవ్యవినిమయ బిల్లు అనంతరం అవసరం అనుకుంటే మిగిలిన అంశాలపై చర్చిద్దామని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులకు సరిగా ప్రొటోకాల్‌ ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క ప్రస్తావించారు.