స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం..

నవతెలంగాణ- ఇంఫాల్‌:  కక్‌చింగ్‌ జిల్లాలోని సెరౌ గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడి భార్య అయిన ఇబేటోంబిని దుండగులు సజీవంగా తగులబెట్టారు. మే 28న ఈ ఘటన జరిగింది. బాధితురాలి భర్త చురాచంద్‌ సింగ్‌ స్వాతంత్య్ర సమరయోధుడు. తన 80వ ఏట మరణించారు. మీతీ, కుకీ తెగల మధ్య ఘర్షణల్లో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో సెరౌ ఒకటి. దుండుగులు గ్రామంపై దాడిచేయడంతో.. వెంటనే పారిపోండని తమ కుటుంబసభ్యులకు ఇబేటోంబి సూచించింది. వయోభారంతో తాను ఇంటిలోనే నిలిచిపోయింది. ఆమె ఇంటికి బయటి నుంచి తాళం వేసిన దుండగులు అనంతరం నిప్పుపెట్టారు. ఆమెను కాపాడేందుకు కుటుంబసభ్యులు వచ్చేసరికే ఇల్లు మొత్తం బూడిదైంది. ఆమె మనవడు ప్రేమ్‌కంఠకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తన బామ్మను రక్షించే ప్రయత్నంలో అతడికి బుల్లెట్‌ గాయాలయ్యాయి.