సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం..

నవతెలంగాణ -తాడ్వాయి 
ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి గొంది వాణిశ్రీ ఆధ్వర్యంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఎంపీపీ గొంది వాణిశ్రీ మాట్లాడుతూ మండలంలోని ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటు పడాలని కోరారు. మండలంలో వర్షాలు అధికంగా కురుస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొదట వ్యవసాయ శాఖ అధికారి పోరిక జైసింగ్ మాట్లాడుతూ రైతులు పండించే పంటను, పంట నమోదు చేసుకోవాలని కోరారు. పంట నమోదు చేసుకోవడం వల్ల పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వీలుంటుంది అన్నారు. మండలానికి ఎంత ఫర్టిలైజర్ అవసరం కూడా తెలుస్తుందని తెలిపారు. ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా పొందిన రెవెన్యూ ఆర్ ఓ ఎఫ్ ఆర్ పోడు పట్టాలు పొందిన రైతులు లోని క్లస్టర్ల వారి ఏఈఓ దగ్గర రైతుబంధు, రైతు బీమాకు నమోదు చేసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ఈ వేణు కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని కరెంటు స్తంభాలు గాని, ట్రాన్స్ఫార్మర్లు గాని, తీగలను గాని, కరెంటు పనిముట్లు ముట్టుకోరాదని తెలిపారు. ఎస్సీ,ఎస్టి వారు కుల ధ్రువీకరణ పత్రం అందించి ప్రభుత్వం ద్వారా పొందే ఉచిత విద్యుత్తును పొందాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నవీన్ మాట్లాడుతూ ఈ వర్షాకాల సీజన్ కాబట్టి చాంబర్ వద్ద, ఓహెచ్ఎస్ఆర్ (ట్యాంక్) చుట్టూ ఎలాంటి నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. రెండుసార్లు బ్లీచింగ్ పౌడర్ వేసి ట్యాంక్ ను శుభ్రపరచాలన్నారు. ఓహెచ్ఎస్ఆర్ లో నీరు విడుదల చేసే ముందు ప్రతి 10, లీటర్లకు 40 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలిపి అర్ధగంట తరువాత నీటిని విడుదల చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాడ్వాయి వైద్యాధికారి రాణదీర్ మాట్లాడుతూ వర్షాకాల సీజన్ కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. నేడు జరుగు నులిపురుగుల దినోత్సవాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు అంగన్వాడీ టీచర్లు, 18 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ వేసి సద్వినియోగం చేయాలని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి యాప సాంబయ్య మాట్లాడుతూ విద్యార్థులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన విద్యను అందించి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. సిడిపిఓ మల్లీశ్వరి మాట్లాడుతూ మండలంలో తొమ్మిది అంగన్వాడీ టీచర్లు, 12 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేయడానికి జిల్లా కార్యాలయానికి నివేదిక పంపించినట్లు తెలిపారు. తీవ్ర, అతి తీవ్ర పోషణలోపం ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్ అందిస్తున్నట్లు తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడి కేంద్రాలలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వసభ్య సమావేశానికి సర్పంచ్లు రాకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, ఎంపిటిసిలు ఇర్సవడ్ల భవాని నారాయణ, వైసిపి పాక కాంత, నాలి సుమలత, జయమ్మ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.