ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మించాలి

– అధునాతన వైద్యం ఉన్నా స్థలం లేదు
– లీగల్‌ సమస్యకు ప్రత్యామ్నాయం ఆలోచించాలి
– ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్‌ తమిళిసై
నవతెలంగాణ – ధూల్‌ పేట్‌
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యసేవలు, వస్తున్న రోగులకు అనుగుణంగా నూతన భవనం నిర్మించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్య రాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని ఆమె సందర్శించారు. సూపరింటెండెంట్‌ కార్యాలయంలో వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, అడిషనల్‌ సూపరింటెం డెంట్‌, ఆర్‌ఎంఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణం లో ఉన్న కులీకుతుబ్‌షా భవనంలోని కార్డియాలజీ నెఫ్రాలకార్డియాలజి, ఏఎన్‌ఎస్యుఐ వార్డులను పరిశీలించారు. రోగుల వద్దకు వెళ్లి వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఒకే భవనంలో నాలుగు అంతస్తుల్లో రోగులను ఇరుకు ఇరుకుగా బెడ్ల పైన ఉంచి వైద్య చికిత్స అందిస్తున్న పరిస్థితిని చూసి గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగో ఫ్లోర్‌లో వార్డులోనే పలు బాత్రూంలకు డోర్లు లేవని, అదేవిధంగా రెండ్రోజుల నుంచి నీరు రావడం లేదని పలువురు రోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రెండో అంతస్తులోని ఫ్లోరింగ్‌ పైకప్పు లేకపోవడంతో దాన్ని చూసిన గవర్నర్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా ఆస్పత్రిలోని ఖాళీ స్థలంలో నూతన భవనాలు నిర్మించాలని పలువురు విభాగాల అధికారులు, సిబ్బంది గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించి ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉస్మానియాలో కనీసం 3000 నుంచి 4000 బెడ్స్‌ ఉండాలన్నారు. మూడు భవనాల్లో ఉండాల్సిన రోగులను ఒక్క భవనంలో ఉంచి వైద్యం అందించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇరుకుగా ఉన్న ఆస్పత్రిలోనే మెరుగైన సేవలు అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 2019లో గవర్నర్‌ అయ్యాక మొదటిసారి తనను ఆస్పత్రి ప్రొఫెసర్‌ డాక్టర్‌ పాండు నాయక్‌, ఓజిహెచ్‌ వైద్యులు వచ్చి కలిసి, లేఖ అందించారని గుర్తు చేశారు. ఆస్పత్రి భవనం విస్తరించాలని అనేక మార్లు ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు. కొత్త భవనం నిర్మాణానికి లీగల్‌ సమస్యలు ఉంటే ప్రత్యామ్నాయ పరిస్థితులు చూడాలన్నారు. త్వరగా నూతన భవనం కట్టాలని చెప్పడం కూడా రాజకీయం అనిపిస్తే ఏమి చెప్పగలమన్నారు. ఇలాంటి విషయాలను సుహృద్భావంతో తీసుకోవాలి కానీ తాను రాజకీయ నేతలా మాట్లాడుతున్నానని అనడం సరికాదన్నారు. తనను ప్రశ్నించడానికి బదులుగా సమస్యకు పరిష్కారం చూపితే బావుంటుందని చెప్పారు. 7.5 ఎకరాల్లో ఎక్కువ అంతస్తులు వేసి ఆస్పత్రి భవనం కట్టొచ్చని సూచించారు.

Spread the love