చిత్ర, టీవీ పరిశ్రమలకు సంపూర్ణ సహకారం

– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-కల్చరల్‌
చిత్ర పరిశ్రమకు, టివి రంగానికి కుల, మత ప్రాంత భేదాలు ఉండవని, వాటి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కరెంట్‌ ఉండదని, నీటి కొరత అని, సినిమా పరిశ్రమకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని అప్పట్లో విష ప్రచారం చేశారని.. అవన్నీ నిజం కాదని రుజువైందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన వేదికపై రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ నిర్వహణలో నృత్య సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఏడాదీ ఐదు వేల సినిమా షూటింగ్స్‌ అవుతున్నాయని, బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలకు కూడా రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదిక అయిందని చెప్పారు. సినిమా టికెట్‌ ధరల విషయంలోనూ, షోల విషయంలోనూ సీఎం సానుకూలంగా స్పందిస్తున్నారని వివరించారు. హైదరాబాద్‌ నగరం వాతావరణం, శాంతి భద్రతలు, అన్ని సంస్కృతులకు అనుకూలమని, వేల మంది టివి, చిత్ర పరిశ్రమలో ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వారిలో అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పారు. చిత్రపురిని మరింత అభివృద్ధి చేయటంతోపాటు ఎన్నికల తరువాత అర్హులకు ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు. ఎఫ్‌డీసి ఎండీ అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఐటీకి, వైద్యానికి కేంద్రంగా ఉందని, ఇటీవల సాధించిన ఆస్కార్‌ అవార్డ్‌తో విశ్వపటంలో హైదరాబాద్‌ చిత్ర పరిశ్రమ నిలిచిందన్నారు. ఎఫ్‌డీసి చైర్మెన్‌ అనిల్‌ కూర్మాచలం మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో టివి, సినీ కళాకారులతో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సినీ, టివీ పరిశ్రమకు చెందిన వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నాగ బాల సురేష్‌కుమార్‌ నిర్వహణలో పలు కళా ప్రదర్శనలు జరిగాయి. నటుడు లోహిత్‌ వ్యాఖ్యానం ఆకట్టుకుంది.

Spread the love