పేద విద్యార్థి కలెక్టర్‌

రామాపురం గ్రామంలో రాజన్న అనే పెద్ద బట్టలు వ్యాపారి ఉన్నాడు. రాజన్న కొడుకు రవి. అదే ఊర్లో చేనేత వృత్తి పని చేసే గోపన్న ఉన్నాడు. అతడు చేనేత ద్వారా బట్టలు తయారుచేసి రాజన్నకి అమ్ముకొని బ్రతుకుతుంటాడు. గోపన్న చాలా బీదవాడు. గోపన్నకి గోపి అనే కొడుకు ఉన్నాడు. రవి, గోపి ఇద్దరు మంచి మిత్రులు ఒకే స్కూల్‌ చదువుతున్నారు. వీళ్ళిద్దరూ 5 వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఐదవ తరగతిలో వున్నప్పుడు రవికి పోలియో వచ్చి నడవలేని స్థితిలో వున్నాడు. ఆ కారణంగా స్కూల్‌ కి వెళ్లడం లేదు. గోపి రోజు స్కూల్‌ కి వెళ్లి టీచర్‌ చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని ప్రతిసారి క్లాస్‌ ఫస్ట్‌ తెచ్చుకుంటున్నాడు. తన మిత్రుడు రవి బడికి రానందున గోపి బాధపడ్డాడు. రవిని చూడ్డానికి రాజన్న ఇంటికి వెళ్లాడు గోపి. అప్పుడు రాజన్న.. ”బాబు గోపి! నువ్వు రోజు బడిలో వింటున్న పాఠాలు రవికి చెబుతూ ఉండు” అని చెప్పాడు. అప్పటినుండి గోపి బడి నుండి వచ్చిన వెంటనే రవి వద్దకు వెళ్లి పాఠాలు చెబుతూ ఉండేవాడు. ప్రతిరోజూ ఇద్దరు మిత్రులు కష్టపడి చదివేవారు. అలా ఇద్దరూ పదవ తరగతికి వచ్చారు. గోపి ప్రతి తరగతిలో క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అది చూడలేక తరగతిలో ఉన్న కొంతమంది విద్యార్థులు గోపి పుస్తకాల సంచిని దాచిపెట్టారు. గోపి ఎంత వెతికినా దొరకలేదు. అసలే పదవ తరగతి చదువుతున్నాడు. పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ నెల రోజుల్లో వున్నాయి. గోపి బాధపడ్డాడు. టీచర్స్‌ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటూనే వున్నాడు. ప్రతిరోజూ రాజన్న ఇంటికి వెళ్లి తాను ఆ రోజు విన్న పాఠాలు రవికి చెబుతున్నాడు. విద్యార్థులంతా పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ రాశారు. కొన్ని రోజులకు ఫలితాలు తెలిసాయి. ఈసారి గోపి జిల్లా ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. టీచర్స్‌, రవి, విద్యార్థులంతా గోపికి అభినందనలు తెలిపారు. ”గోపీ!!.. నీ పుస్తకాల సంచి మేమే దాచేసాం. మమ్మల్ని క్షమించు! అయినా నీకు మంచి ర్యాంకు ఎలా వచ్చింది?” అని అడిగారు గోపి పుస్తకాలు దాచేసిన తోటి విద్యార్థులు. ”ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఏ రోజువి ఆ రోజే చదివాను. నా మిత్రుడు రవి దగ్గరికి వెళ్లి అవే పాఠాలు తనకి కూడా చెప్పాను. అలా ప్రతి పాఠం రెండు సార్లు చదివినట్లయింది నాకు. అందుకే పాఠాలన్నీ బాగా గుర్తుండిపోయాయి. కష్టపడి చదివితే ఎవరైనా సాధించగలరు” అని గోపి చెప్పాడు. గోపి పేదవాడైనా తెలివైన విద్యార్థి. అందుకే స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు, తన మిత్రుడు రవి తండ్రి రాజన్న, ఇంకా జిల్లా కలెక్టర్‌ కూడా గోపి పై చదువుల కోసం ఆర్థిక సహాయం చేశారు. వారి సహాయ సహకారాలతో గోపి ఐ.ఎ.ఎస్‌ చదివి కలెక్టర్‌ అయ్యాడు. కలెక్టర్‌ గోపికి అందరూ అభినందనలు తెలిపారు. గోపి తండ్రి గోపన్నకి ఆనందం అంతు పట్టలేదు. తన కొడుకుని ఇంతటి వాడిని చేసిన వారందరినీ ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలిపాడు. గోపి మిత్రుడు రవి, అతని తండ్రి రాజన్న చాలా ఆనందంతో కలెక్టర్‌ గోపిని మనసుకి హత్తుకొని మురిసిపోయారు. గోపి చదివిన హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… ”ఇలాంటి తెలివైన విద్యార్థులకు కొంచెం చేయూతనిస్తే సొంతూరే కాకుండా దేశమే గర్వించదగ్గ పౌరులు తయారవుతారు. ఉన్న ఊరికే కాదు, దేశానికి కూడా నిస్వార్థంగా సేవ చేయగలరు” అని గర్వంగా చెప్పారు.
– బల్లా కృష్ణవేణి

Spread the love