గుండె కొలిమిలో మండిన పాట

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో వేల పాటలు పుట్టుకొచ్చాయి. కొన్ని సరదాలను పుట్టించేవైతే మరికొన్ని సంచలనాలను సృష్టించేవి. కొన్ని హృదయాలను తడిమి వెళ్ళిపోయేవైతే మరికొన్ని హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయేవి. ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలైతే దేనికదే ప్రత్యేకమైనది. అయితే వీటిలో.. తెలంగాణ పలుకుబళ్ళను పొదుగుకుని, ఆవేశంతో కూడిన గాంభీర్యాన్ని నింపుకుని జాతి ఆత్మగౌరవాన్ని గుండె గొంతుకతో వినిపించిన పాట గా ”కొమురం భీముడో కొమురం భీముడో” పాటను గుర్తించవచ్చు.

       సంచలన గీతాలకు చిరునామాగా నిలిచిన తెలుగు సినీ గీతరచయిత డా.సుద్దాల అశోక్‌ తేజ. వీరావేశం రంగరించి రాసిన అభ్యుదయగీతమైనా, యాసను పండించి పలికించిన జానపదగీతమైనా, లాలిత్యంగా రవళించే శృంగారగీతమైనా, అది ఏ వస్తువైనా అశోక్‌తేజ కలం సోకి వేయిగొంతుకలతో ప్రజ్వలించాల్సిందే.
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ (2022) సినిమా ఒక చారిత్రక విజయం సాధించింది. అంతే కాదు ఆ సినిమాలో అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో కొమురం భీముడో’ పాట కూడా ఒక చారిత్రక విజయమే. సినిమా మొత్తానికి ఈ పాట తలమానికంగా నిలిచింది.
తెలంగాణ వీరత్వాన్ని, శౌర్యపరాక్రమాన్ని, నేల పటుత్వాన్ని చాటి చెప్పిన పోరాటయోధుడు కొమురం భీముని ధైర్యసాహసాలను, ఆత్మగౌరవాన్ని, హిమాలయమంత విస్తృతంగా విస్తరించిన ఆయన ఔన్నత్యాన్ని ఈ పాటలో వివరించారు అశోక్‌ తేజ. రగులుతున్న ఆశయాన్ని ఏ దెబ్బలు ఏమీ చేయలేవని, సంకల్పాన్ని ఊపిరిగా భావించినవాణ్ణి ఏ మృత్యువు ఎదుర్కోలేదన్న దృఢమైన నిశ్చయాన్ని ఈ పాటలో అశోక్‌ తేజ స్పష్టపరిచిన తీరు అత్యద్భుతం.
సన్నివేశపరంగా చూసినట్లయితే.. తనను తలవంచమని కొరడాలతో హింసిస్తూ అడిగిన అధికారులకు తాను ఓ పాటై సమాధానమివ్వడం ఇక్కడ ప్రత్యేకమైన విషయం. కొమురం భీం చేసుకున్న ఆత్మబోధ ఇది. ఈ పాటలో అతని ఆత్మావిష్కరణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొర్రాసునే (కొర్రాయి) – కొరకాసు అని అంటారు. పొయ్యిలో మండే కట్టె అని అర్థం. నెగడు – నిప్పుకణం, సెగ అని అర్థం. అంటే కాలే కట్టె నుండి పుట్టిన నిప్పుకణమై మండాలి కాని అవినీతి ప్రభుత్వానికి తలను మాత్రం వంచొద్దు. వారి ముందు సాగిల పడొద్దు అంటున్నాడు. ఎర్రగా మెరిసే సూరీడై రగులుతూనే ఉండాలి కాని వారి ముందు బానిసలా వంగి వంగి దండాలు బెట్టే గుణం సరికాదని అంటున్నాడు. బానిససంకెళ్ళను నిరసించి స్వేచ్ఛాస్వాతంత్య్రం కోసం దెబ్బలు తింటున్న కొమురం భీం అంటున్న మాటలివి. అయితే, కొమురం భీం కు ఈ పాట వేరే ఎవరో చేసిన సందేశంలాగా కాకుండా తనకు తాను చేసుకున్న హితబోధలా ఉండడం విశేషం.
ఎన్ని దెబ్బలు తిన్నా ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దన్న కొమురంభీం వ్యక్తిత్వం ఈ పాటలో కనబడుతుంది. ఇది కేవలం కొమురం భీంకు పడుతున్న శిక్ష కాదు, జాతి ఆత్మగౌరవానికి పెట్టిన అగ్నిపరీక్ష. కొమురంభీం తలవంచితే అతనొక్కడే తలవంచినట్టు కాదు. జాతి మొత్తం తలవంచినట్టే. జాతి తన అస్తిత్వాన్ని కోల్పోయినట్టే. అంటే జాతి పరువు అతనొక్కడి చేతిలో ఉంది. దాన్ని నిలబెట్టే బాధ్యత అతనికుంది. అందుకే అతడు తలఒగ్గలేదు. కాల్మొక్త బాంచెన్‌ అంటూ అధికారుల ముందు వంగి తోగావంటే – అంటే వంగితే కనుక నువ్వు కారడవి తల్లి కడుపున పుట్టిన కొడుకువి కానట్టే. అని తనకు తాను ధైర్యాన్ని నూరిపోసుకుని సమాధాన పరుచుకుంటున్నాడు. ఈ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూస్తూ ఉన్న తన జాతిప్రజలకు మరింత ఆవేశాన్ని నూరిపోస్తూనే ఉన్నాడు. ఈ పాటలో ‘ఓగాలా అనే పదం ‘ఒకవేళ’ అనే అర్థాన్ని సూచిస్తుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని గోండు ప్రజలు వాడే పదాలు ఈ పాటలో కనబడతాయి.
జులుముగద్దె – అధికారుల సింహాసనం, పీఠం అని అర్థం. అహంకారం ఆవరించుకున్న అధికారుల పీఠానికి నువ్వు తలని వంచినట్లయితే తుడుము తల్లి పేగుల పెరగనట్టే మరి అంటాడు. తుడుము – అంటే గోండు వారి ‘డోలు’ అని అర్థం.. అది వారు ప్రధానంగా వాడే వాయిద్యం. ఆ తుడుము వాయిద్యాన్ని తల్లిలాగా భావించే గోండు సంప్రదాయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
చర్మం ఒలిచిపోయేలా ఆంగ్లేయులు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక ఒకవేళ అబ్బా అని అరిచినా, నీ ఒంట్లో నుంచి కారే రక్తధారల్ని చూసి నీ ఓపిక నశించిపోయి ఒకవేళ నీ మనోధైర్యం చెదిరిపోతే, బుగులుతో కన్నీరు పెట్టినట్లయితే నువ్వు నిజంగా ఈ నేలతల్లి చనుబాలు తాగినవాడివి కానట్టే. నిన్ను కన్న భూతల్లికి నువ్వు కొడుకువి కానట్టే. ఆ తల్లి ఒడిలో నువ్వు పెరగనట్టే అంటాడు. ఇందులో వాడిన ‘బుగులు’ అనేది అందమైన ప్రయోగం. ఎప్పుడైనా మనసు ఏదో తెలియని భయంతో గాబరాగా ఉంటే కడుపులో అదో రకమైన వణుకు పుడుతుంది. దానిని బుగులు అంటాం. బాధ వేరు. బుగులు వేరు. అనిశ్చితిలో కలిగే అనుభవాన్ని ‘బుగులు’ అంటాం. ఈ పదం ఈ పాటలో అద్భుతంగా ప్రయోగించబడింది.
అటు దెబ్బలు పడే కొద్దీ పెరిగిపోతున్న బాధను అదిమిపట్టుకుంటూ, ఇటు తగ్గిపోబోతున్న సహనానికి ఆశయాన్ని, ఆవేశాన్ని జోడించుకుంటున్నాడు కొమురంభీం. తలవంచమని, తమ ముందు వంగి సలాములు చేయమని, తన తప్పును ఒప్పుకొమ్మని చెప్పిన ఆంగ్లేయ అధికారులకు తాను తలవంచనని చెప్పడమే కాదు. వాళ్ళు కొట్టే దెబ్బలకు కన్నీరు కార్చినా, బాధపడినా తాను వాళ్ళముందు ఓడిపోయినట్టేనన్న భావనను ఈ పంక్తులు తెలియజేస్తున్నాయి.
గుండెలోని రక్తం కాలువలై పారినా నువ్వు వెనక్కి తగ్గకు. ఆ నెత్తురు జలజలపారి నేలతల్లికి నుదుట పెట్టిన బొట్టవుతుంది. అంతే కాదు, గోండుతల్లి కాళ్ళకు పారాణై వెలుగుతుంది. ఆ తల్లి పెదవులపై నవ్వై మెరిసిపోతుంది. ఇక్కడ. తల్లి పెదవులపై నవ్వై మెరవడమంటే.. అతని వీరత్వంతో ఆమెకు గర్వంతో కూడిన మందహాసం కలుగుతుందని భావం. నుదుట తిలకమై, కాళ్ళపారాణియై, పెదవుల నవ్వై.. ఇలా శాశ్వతమైన కాంతికి ప్రతీకలుగా అతని త్యాగనిరతి చిరస్థాయిగా నిలిచివుంటుందని ఈ పాట వివరిస్తుంది. అంటే అతని త్యాగం వృధా కాదని అది ఎందరికో ఊపిరిపోసే మంత్రధ్వానమై మోగుతుందని, ఆదర్శమై నిలుస్తుందని అర్థం. అంతే కాదు, భూతల్లికి నీ బతుకును అరణంగా అర్పించావు అంటారు అశోక్‌ తేజ. అరణం అంటే సజీవమైన కానుక అని అర్థం. తన జీవితాన్ని భూతల్లికి సజీవంగా అర్పించాడని, అది తులలేనిదనే భావన ఇక్కడ స్ఫురిస్తుంది. ఈ పాటతో తన జాతిప్రజల్లో ఆవేశాన్ని నింపి అవినీతి ప్రభుత్వంపై కాలుదువ్వి పోరుసలిపేలా చేస్తాడు కొమురంభీం.
ఈ పాటలో అశోక్‌ తేజ ప్రయోగించిన మాండలిక పదాలు అసాధారణమైనవి. కొర్రాసు, నెగడు, రగ రగ, ఓగాలా, కాల్మొక్త బాంచెన్‌, జులుము, తుడుము, బుగులు, అరణం వంటివన్నీ పాటకు ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. జానపదయాసను, మాండలిక పదాల నిగారింపును ఎంతో మెండుగా కలానికెక్కించుకున్నవారైతేనే ఇలాంటి పాటను రాయగలరు. ఇలాంటి పదప్రయోగ వైచిత్రిని, భావగరిమను పలికించడంలో అశోక్‌ తేజ నేర్పరి. ఎం.ఎం.కీరవాణి సంగీతం, కాలభైరవ గానం, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభినయం కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పవచ్చు.
పాట:-
కొమురం భీముడో కొమురం భీముడో/ కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో/ కొమురం భీముడో కొమురం భీముడో రగరాగ సూరీడై రగలాలి కొడుకో/
కాల్మొక్త బాంచేనని ఒంగి తోగాలా/కారడవి తల్లీకి పుట్టానట్టేరో పుట్టానట్టేరో/ జులుముగద్దెకు తలని ఒంచి తోగాలా/ తుడుము తల్లీ పేగున పెరగానట్టేరో
సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాల/ సినికే రక్తం సూసి సెదిరేతోగాల/ బుగులేసి కన్నీరు వలికి తోగాల/ భూతల్లి సనుబాలు తాగనట్టేరో
కాలువై పారే నీ గుండె నెత్తూరూ/ నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు/ అమ్మ కాళ్ళ పారాణైతుంది సూడు/ తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు/ కొమురం భీముడో కొమురం భీముడో/ పుడమితల్లికి జన్మ అరణమిస్తివిరో కొమురం భీముడో.

– డా||తిరునగరి శరత్‌ చంద్ర,
sharathchandra.poet@yahoo.com

Spread the love