‘నాకు ఆకలేస్తోంది’, ‘మా అమ్మ చనిపోయింది’

నవతెలంగాణ – అమెజన్: 40 రోజుల అనంతరం ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారులు మాట్లాడిన మాటలను రెస్క్యూ సిబ్బంది ఒకరు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు ఆకలేస్తోంది’, ‘మా అమ్మ చనిపోయింది’ అని ఆ చిన్నారులు చెప్పినట్టు తెలిపారు. అమెజాన్‌ అటవీ ప్రాంతం పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారే ప్రాంతానికి మే 1వ తేదీన ఓ విమానం బయలుదేరింది. అందులో పైలట్‌, గైడ్‌ సహా నలుగురు చిన్నారులు, వారి తల్లి ఉన్నారు. అయితే, విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా అమెజాన్‌ అడవిలో కూలిపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు ‘ఆపరేషన్‌ హోప్‌’ పేరుతో సహాయక చర్యలు ప్రారంభించారు. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత శుక్రవారం చిన్నారులను సజీవంగా గుర్తించారు. ప్రస్తుతం ఆ నలుగురు చిన్నారులు కొలంబియా రాజధాని బొగొటాలోని మిలటరీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కాగా, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న నికోలస్ ఆర్డోనెజ్ గోమెస్  పబ్లిక్ ప్రసార ఛానెల్ ఆర్టీవీసీతో మాట్లాడుతూ.. పిల్లల్ని కలిసిన తర్వాత మొదటి క్షణాలను వివరించారు. నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లెస్లీ వయసు 13 ఏళ్లు. ఆమె ఒక ఏడాది వయసుగల చిన్నారిని ఎత్తుకుని పరుగులు తీస్తూ తన వద్దకు వచ్చిందని చెప్పారు. లెస్లీ తన వద్దకు వచ్చి మొట్టమెదటగా ‘నాకు ఆకలి వేస్తోంది’ అని చెప్పిందన్నారు. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు పడుకొని ఉన్నారని.. అందులో ఒకరు లేచి ‘మా అమ్మ చనిపోయింది’ అని చెప్పాడు’అని నికోలస్ వివరించారు. వారి మాటలు విన్న తాము వెంటనే పిల్లల్ని సముదాయించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ‘మేం మీ స్నేహితులం. మమ్మల్ని మీ కుటుంబ సభ్యులే పంపించారు. మీ నాన్న, మీ అంకుల్ పంపించారు‘ అని పిల్లల్తో చెప్పినట్లు నికోలస్ తెలిపారు.

Spread the love