భూదాన పత్రాలు పొందిన పేదలందరికీ పట్టాలివ్వాలి

– సీపీఐ(ఎంఎల్‌)ఆర్‌ఐ, ఓపీడీఆర్‌, ఏఐఆర్‌డబ్ల్యూఓ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భూదాన పత్రాలు పొందిన పేదలందరికీ వెంటనే పట్టాలివ్వాలని ఓపీడీఆర్‌ రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది టి.లక్ష్మీదేవి, ఏఐఆర్‌డబ్ల్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు బీవీ.సుధారాణి, సీపీఐ(ఎంఎల్‌) ఆర్‌ఐ రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందం, రాష్ట్ర కమిటీ సభ్యులు పూర్ణచందర్‌రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో భూదాన్‌ యజ్ఞ బోర్డు చైర్మెన్‌ గున్నా రాజేందర్‌రెడ్డి తారామంతి పేటలోని 235, 236, 615, 616, 617 తదితర సర్వే నెంబర్లలో 2014 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కుటుంబానికీ 100 గజాల చొప్పున ఇంటి స్థలాలను ఇచ్చి ప్రొసీడింగ్స్‌ ను జారీ చేసారని గుర్తుచేశారు. ఆ ప్రొసీడింగ్‌ ఆర్డర్లు పొందిన పేదలు తాము ఇండ్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని హయత్‌నగర్‌ ఎస్టీఓ కార్యాలయంలో తలా రూ.3200 జమచేశారని తెలిపారు. అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ కూడా పేదలకు డీ ఫాం పట్టాలివ్వాలని కలెక్టర్‌కు లేఖ రాశారని గుర్తుచేశారు. కలెక్టర్‌ ఇవ్వకుండా తాత్సారం చేశారని ఆరోపించారు. సీఎం కూతరు కవిత, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అఈ, తదితరులకు వినతిపత్రాలిచ్చినా, ధర్నాచౌక్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేసినా రాష్ట్ర సర్కారు పట్టడం లేదని వాపోయారు. ఆ పేదలకు డీ ఫాం పట్టాలివ్వాలని హైకోర్టు చెప్పినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.