హైదరాబాద్‌లో మరో టెక్నాలజీ సెంటర్‌ ముందుకొచ్చిన యూకేకి

– చెందిన లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌
– 600 మందికి ఉద్యోగ అవకాశాలు
–  హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. యూకేకి చెందిన లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లో తన టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నది. గత నెల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం ఐదు వారాల్లోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు లాయిడ్స్‌ నిర్ణయం తీసుకుంది. వ్యాపార అనుకూలతలు, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని లాయిడ్స్‌ బ్యాంక్‌ తెలిపింది. ఆర్థిక సేవలు అందించడంలో యూకేలో టాప్‌ పొజిషన్‌లో ఉన్న లాయిడ్స్‌ బ్యాంకుకు దాదాపు 2.60కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు సదరు సంస్థ తెలిపింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులకు దీర్ఘకాలం పాటు సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలవుతుందని లాయిడ్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాన్‌వాన్‌ కేమెనడే తెలిపారు. టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుతో తమ సంస్థకు మరిన్ని అవకాశాలు రానున్నాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న అద్భుత మానవ వనరులు, వారి నైపుణ్యం, ఇన్నోవేషన్‌ రంగంలో ఉన్న వారి ప్రతిభ తమ సంస్థ పురోగతికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో లాయిడ్స్‌ బ్యాంక్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. లాయిడ్స్‌ బ్యాంక్‌ గ్రూపునకు మంత్రి సాదర స్వాగతం పలికారు. యూకేలో కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బందంతో గత నెల సమావేశం అయిన అనతికాలంలోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషాన్ని ఇస్తుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ రంగంలో ఉన్న ఎకో సిస్టంతో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించేందుకు లాయిడ్స్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సుమారు 600 మందిని తొలి ఆరు నెలల్లో ఉద్యోగాల్లోకి తీసుకోనున్నదనీ, తర్వాత ఈ సంఖ్యను పెంచుతుందని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని బీఎఫ్‌ఎస్‌ఐ ఎకో సిస్టమ్‌కు లాయిడ్స్‌ బ్యాంక్‌ టెక్నాలజీ సెంటర్‌ మరింత బలోపేతం చేస్తుందన్నారు

Spread the love