ఆసియా కప్‌ దారెటు?

– ఆదివారం తేలనున్న భవితవ్యం
– బంగ్లా, శ్రీలంక, అఫ్గాన్‌ బోర్డులతో 28న షా భేటీ
న్యూఢిల్లీ : 2023 ఆసియా కప్‌పై సందిగ్థత కొనసాగుతుంది. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి) ఆసియా కప్‌ నిర్వహణపై పట్టుదలగా కనిపిస్తుండగా.. మరోవైపు ఆసియా కప్‌లో పోటీపడే ఇతర జట్లు భిన్న స్వరం వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆసియా కప్‌ భవితవ్యం ఆదివారం తేలనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫైనల్‌ మే 28న జరుగనుంది. ఐపీఎల్‌ టైటిల్‌ పోరుకు బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌, శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధ్యక్షులను బీసీసీఐ ఆహ్వానించింది. అదే రోజు అహ్మదాబాద్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మెన్‌, బీసీసీఐ కార్యదర్శి జై షాతో మూడు దేశాల బోర్డుల ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆసియా కప్‌పై ముందుకెళ్లే విధానంపై ఓ నిర్ణయానికి రానున్నట్టు సమాచారం. ‘బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌, శ్రీలంక క్రికెట్‌ బోర్డుల ప్రతినిధులు ఐపీఎల్‌ 2023 ఫైనల్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆసియా కప్‌ 2023పై చర్చించనున్నారు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించటంతో పాక్‌లో పర్యటించేందుకు భారత్‌ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కలిగి ఉంది. నిర్వహణపై పిసిబి రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో ఒకటి, భారత్‌ ఆడే మ్యాచులను తటస్థ వేదికపై నిర్వహించటం. రెండోది, గ్రూప్‌ దశలో కనీసం నాలుగు మ్యాచులు పాకిస్థాన్‌లో నిర్వహించటం, భారత్‌ ఆడే మ్యాచులు సహా ఫైనల్‌కు దుబారు ఆతిథ్యం!. ఇందులో తొలి ప్రతిపాదన ఇప్పటికే తిరస్కారానికి గురైంది. రెండో ప్రతిపాదనపై అహ్మదాబాద్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు శ్రీలంక సిద్ధంగా ఉన్నప్పటికీ.. పిసిబి అంగీకరించటం లేదు. ఆసియా కప్‌ ఆదాయంలో 80 శాతం భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ నుంచే వస్తుంది. అయితే, టికెట్‌ సొమ్మును సైతం వదులుకునేందుకు పిసిబి సుముఖంగా లేదు. పిసిబి చైర్మెన్‌ నజం సేథి, జై షాలు ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు సమావేశమయ్యారు. అయినా, ఆసియా కప్‌పై స్పష్టత రాలేదు.

Spread the love