ఫంగస్‌కు దూరంగా..

సీజన్‌ ప్రభావం మొక్కలపై ఉంటుంది. దీనికి తోడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కళకళలాడే బాల్కనీ తోట కళా విహీనమ వుతుంది. వేసవిలో నీరు లేకపోవడం కారణమైతే, ఈ సీజన్‌లో వాతావరణంలోని తేమతో పాటు కాస్త నీరెక్కువైనా లేదా వ్యాధులతో మొక్కలు చనిపోతుంటాయి. మరి అలాంటప్పుడు జాగ్రత్తలేం తీసుకోవాలో చూద్దాం.

చినుకులు పడుతున్నవేళ మొక్కలకు వీలైనంత సహజ ఎరువులేయడం మంచిది. ఆవుపేడ, కడిగి ఆరబెట్టిన టీ పొడి, వంటింటి వ్యర్థాలు, తోటలో పేరుకుపోయిన ఆకులు, కొమ్మలతో చేసిన వర్మీ కంపోస్ట్‌ వంటివి మాత్రమే అందించాలి. వర్షాలు పడేటప్పుడు నత్తల వంటివి తొట్టెను అంటిపెట్టుకొని ఉంటుంటాయి. వీటిని తొలగించి దూరంగా పడేయడం మంచిది. లేదంటే మొక్కలకు వీటి వల్ల చీడలు పట్టే అవకాశాలుంటాయి. అలాగే వాన పాములను తోట మట్టిలో ఉండేలా చూడాలి. ఇవి మట్టిని గుల్ల చేసి మొక్కలకు కావాల్సిన పోషకాలు అందేలా చేయడంలో తోడ్పడతాయి.
ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలకు నీటి అవసరం తక్కువ. ఇలాంటప్పుడు తుంపర్ల విధానం ద్వారా నీటిని అందిస్తే మేలు. ఒకవేళ మొక్క చుట్టూ ఉన్న మట్టి గట్టిపడితే… రెండుమూడు వారాలకొకసారి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తొలచి గుల్లగా చేస్తే వేర్లకు గాలి అంది ఆరోగ్యంగా ఎదుగుతాయి.
తొట్టెలో నీరు బయటికి పోయేలా ఏర్పాటుండాలి. లేదంటే నీటిని అందించినప్పుడు, తొట్టెలోనే నిల్వ ఉండిపోతాయి. దీంతో ఎండ రానప్పుడు మొక్కలు వడలిపోయినట్టు కనిపిస్తాయి. క్రమేపీ మొక్క మొదట్లో తేమ ఎక్కువై, వేర్ల నుంచి కుళ్లిపోవడం ఆరంభమవుతుంది. ఇలా జరగకుండా కుండీలకున్న రంధ్రాలను అప్పుడప్పుడు స్క్రూ డ్రైవర్‌తో గుచ్చాలి. మూసుకుపోయిన మట్టి వదులై అదనపు నీరు వెంటనే బయటికొస్తుంది. అదనపు నీరు కిందకు కారకుండా తొట్టె అడుగు భాగాన ఉంచే ప్లేటును ఈ సీజన్‌లో తొలగించాలి. లేదంటే వర్షపు నీరు అందులో చేరి ఫంగస్‌ పెరిగి, మొక్కకు చేటు చేయొచ్చు.