బడిబాటను విజయవంతం చేయాలి

– సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదును పెంచాలి : టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల మూడు నుంచి 17వ తేదీ వరకు జయశంకర్‌ బడిబాటను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) కోరింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చింది. బడిబాటలో స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించింది. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటంలో ఉపాధ్యాయులుగా తమవంతు కృషి చేస్తామని చెప్పారు. అయితే ఉపాధ్యాయుల కొరతను తీర్చి, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని అన్ని పాఠశాల లకూ వర్తింపజేసి సత్వరమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ అన్ని యాజ మాన్యాల ఉపాధ్యాయులకూ బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌ బిల్లులన్నీ విడుదల చేయాలని, మొదటి తేదీన వేతనాలివ్వాలని చెప్పారు. బకాయి ఉన్న మూడు డీఏలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు జేఏసీగా ఏర్పడి ఐక్య ఉద్య మాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె సోమశేఖర్‌, ఎ వెంకట్‌, ఎం రాజశేఖర్‌రెడ్డి, వి శాంతకుమారి, జి నాగమణి, కె రవికుమార్‌, జి శ్రీధర్‌, ఎ సింహాచలం, వై జ్ఞానమంజరి, ఎస్‌కె మహబూబ్‌అలీ, ఎస్‌వై కొండలరావుతోపాటు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love