62 మంది వైద్యులకు బీహార్‌ నోటీసులు

పాట్నా: ఏళ్ల తరబడి విధులకు డుమ్మా కొడుతున్న 62 మంది వైద్యుల కు బిహార్‌ ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. వీళ్లంతా కనీసం ఏడాదికి పైబడి విధులకు హాజరుకాని వాళ్లే. 15 రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది.నోటీసులు జారీ చేసిన వైద్యుల పేర్లు, వారు పని చేస్తున్న ఆరోగ్యకేంద్రాలు, ఆస్పత్రుల వివరాలను వైద్యశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. నిర్దేశించిన గడువులోగా సంబంధిత అధికారులకు సరైన వివరణ ఇవ్వకపోతే.. ప్రభుత్వ నోటీసులను ధిక్కరించినట్లుగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పైఅధికారుల అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరైనట్లయితే.. సర్వీసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. నోటీసులు జారీచేసిన వారిలో అత్యధికంగా 14 మంది రాజధాని పాట్నాలోనే విధులు నిర్వహిస్తున్నారు. కాగా, విధులకు గైర్హాజరయ్యారన్న కారణంతో గత జనవరిలో బిహార్‌ ప్రభుత్వం 64 మంది వైద్యులను విధుల నుంచి తొలగించింది. ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ అధ్య క్షత మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసు కుంది. అంతకుముందు గైర్హాజరుకు గల కారణాలను వివరించాలంటూ ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించింది. అయితే, వైద్యుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రభుత్వం వారందరినీ డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love