బంధాల ఏజెన్సీ రహదారులు అధ్వాన్నం

– చినుకు పడితే చిత్తడి
– బంధాల ఏజెన్సీ అభివృద్ధి కి అడ్డంకిగా మారిన ఫారెస్ట్ అధికారులు 
– కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని గ్రామస్తుల వేడుకోలు
– గర్భిణీ స్త్రీలను ముందస్తుగా సేఫ్ జోన్ కు తరలిస్తున్న అధికారులు
నవతెలంగాణ -తాడ్వాయి 
గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మండలంలోని బంధాల ఏజెన్సీలో రహదారులు మరింత అధ్వాన్నంగా మారాయి. కనీసం సైకిల్ మీద కూడా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బిఆర్ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమం అంటూ అభివృద్ధిని విస్మరించింది. రహదారుల దుస్థితిపై ప్రభుత్వం గానీ, ప్రజాప్రతినిధులు గానీ, అధికారులుగానీ దృష్టి సారించిన దాఖలాలు లేవు. బంధాల ఏజెన్సీలోని ఆదివాసి గ్రామాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బంధాల గ్రామపంచాయతీ పరిధిలో బొల్లెపల్లి, బంధాల, పోచాపూర్, అల్లిగూడెం, నర్సాపూర్ (పిఎల్) ఆదివాసి గ్రామాల పరిస్థితి మరీ దారుణం. 108, 102, 104 వాహనాలు కూడా వెళ్లక రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి రోగులు గర్భిణీ స్త్రీలు పిల్ల తల్లులు బాలింతలు పడే బాధ వర్ణాతీతం. గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వాహనాలు నడువని ఏజెన్సీ ప్రాంతం నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ఎం సి హెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ పవన్, స్థానిక సర్పంచ్ ఊకే మోహన్ రావు, కొందరి స్థానికులతో తో కలిసి బుధవారం గుమ్మడి సాంబలక్ష్మి, చింత అనుష అనే ఆదివాసి గిరిజన నిండు గర్భిణీ స్త్రీలను ఒక ఆటోలో వాగులు, వొర్రెలు దాటుకుంటూ, అతి కష్టం మీద కొడిశ ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుండి 108 ద్వారా జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి జిల్లా వైద్యాధికారి అప్పయ్య, స్థానిక సర్పంచ్ ఊకే మోహన్ రావు లు మాట్లాడుతూ గతంలో బంధాల ఏజెన్సీ రోడ్లను మరమ్మతులు చేయడానికి పది లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని. ఫారెస్ట్ అధికారుల ధమనకాండతో బంధాల ఏజెన్సీ అభివృద్ధికి నోచుకోవడం లేదని వారు మండిపడ్డారు. వర్షాకాలంలో ఆదివాసి గిరిజన స్త్రీలు పడుతున్న బాధను గ్రహించి ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు మేలుకొని బంధాల ఏజెన్సీలో పాత రోడ్లను మరల చేయడానికి అనుమతులు ఇవ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తోటి రోడ్లు మంజూరు చేయాలని మంజూరైన రోడ్లను దగ్గరుండి నిర్మించాలని స్థానిక సర్పంచ్ గ్రామస్తులు కోరారు.