ఇద్దరూ…’రహస్య’ మిత్రులు ప్రజల సొమ్మును లూటీ చేస్తున్న తెలంగాణ సర్కార్‌

రైతుబంధుతో ఒరిగిందేమీ లేదు
పేదల పార్టీ అంటే కాంగ్రెస్సే : ఏఐసీసీ సెక్రెటరీ, కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య మిత్రులని, రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఐసీసీ సెక్రెటరీ, కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా చందన పల్లి వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రకు హాజరై మద్దతు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి పలు దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని, దానికి గల కారణం వారిద్దరి మధ్య ఉన్న స్నేహమేనని స్పష్టం చేశారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చే విషయంలో ఏఐసీసీ పెద్దలదే తుదినిర్ణయమన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. దారి వెంట ప్రజలు తమ సమస్యలను, కష్టాలను, ఇబ్బందులను భట్టికి చెప్పుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచడానికే భట్టి పాదయాత్ర చేస్తున్నారన్నారు. 2024లో 100 శాతం కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల సంపద లూటీ చేసి ఇతర రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్‌ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి వెనక్కి గుంజుకుంటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని పెద్దలకు కట్టబెడుతున్నదన్నారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తాగునీటి కోసం గ్రామాల్లో ప్రజలు తండ్లాడుతున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కచ్ఛితంగా గెలుస్తుందన్న సంకేతాలు రావడంతో బీఆర్‌ఎస్‌, బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకొని వారిని పార్టీలోకి చేర్చుకుంటామన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గమ్యం, గమనం లేని నేత పొద్దుతిరుగుడు పువ్వు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రమేనన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అధికారం చుట్టూ తిరిగే వ్యక్తి అన్నారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తున్న నాకు గమ్యం, గమనం ఉందని, భగ భగ మండుతున్న ఎండలు, గాలివానలతో టెంట్లు కూలిన, అకాల వర్షంలో తడుస్తూ నడిచానే తప్ప పాదయాత్ర ఎక్కడ ఆపలేదన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియా సాక్షిగా దేశానికి చూపించామన్నారు. రూ.42 వేల కోట్ల నిధులతో ఇంటింటికి నీరు అందించే మిషన్‌ భగీరథ నీళ్ళు నేను పాదయాత్ర చేసిన గ్రామాల్లో 90 శాతం కనిపించలేదన్నారు. ఖాళీగా ఉన్న పైపులు, కట్టిన ట్యాంకులను ప్రజలు చూపించారన్నాని తెలిపారు. నీళ్ల పండుగ పేరుతో జలాల్లో పసుపు, కుంకుమ వదులుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మెన్ల గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌, నక్కలగండి పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు.

Spread the love