ఉభయ సభలు రేపటికి వాయిదా

Parliament Sessionనవతెలంగాణ – హైదరాబాద్
హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అంశం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తోంది. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉదయం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. అనంతరం లోక్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అనంతరం తిరిగి ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని పట్టుబడ్డాయి. చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా విపక్షాలు సభలో నిరసనకు దిగారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు లోక్ సభలోనూ ఇదే పరిస్థితి. మణిపూర్ పరిస్థితిపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలంటూ విపక్ష నేతలు పట్టుబడటంతో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు.