బీసీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న బీఆర్ఎస్

– కాంగ్రెస్ ఓ.బి.సి సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్
నవతెలంగాణ – కంటేశ్వర్
కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించిన కులవృత్తుదారులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అనే పథకం ద్వారా బీసీల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తుందని కాంగ్రెస్ ఓ.బి.సి సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులవృత్తుదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కాదని అర్హత ఉన్న ప్రతి బీసీకి బీసీ బందు ప్రకటించాలని ఆయన అన్నారు. కుల వృత్తుదారులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అని చెప్పి కేవలం కొన్ని కులాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని ఆ పరిగణలోకి తీసుకున్న కులాల్లో సైతం నియోజకవర్గానికి కేవలం 1200 మందికి అది కూడా ఇంట్లో ఒక్కరికి అది కూడా 55 ఏళ్ల లోపు వారికి అవకాశం ఇస్తూ గతంలో 50వేల పైచిలుకు రుణం తీసుకున్న వారు అనర్హుల్గా పేర్కొంటూ ఇలా అనేక కొర్రీలు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కులాలకు ఆర్థిక సాయం చేసి మిగిలిన కులాలను విస్మరించడం వల్ల బీసీ కులాల్లో చిచ్చు రేపి తద్వారా కెసిఆర్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. మునుగోడు సమయంలో దళిత బంధు లాగానే గిరిజన బందు మరియు బీసీ బందు కూడా ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటివరకు దానిపై స్పందించలేదని హఠాత్తుగా ఇప్పుడు బీసీలు గుర్తుకు రావడానికి కారణం వచ్చే నెలలో ప్రియాంక గాంధీ గారు మరియు రాహుల్ గాంధీ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున బిసి డిక్లరేషన్ ప్రకటిస్తారని ముందుగానే గ్రహించిన కేసీఆర్ బీసీల మధ్య ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి పథకంతో ముందుకు వచ్చారని ఆయన అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా గుర్తుకురాని బీసీలు కులవృత్తిదారులు ఇప్పుడు కేసీఆర్ కు గుర్తొచ్చారా అని ఆయన ప్రశ్నిస్తూ బీసీ సబ్ ప్లాన్ అమలు చేయకుండా మోసం చేశారని జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు రాయితీలు సబ్సిడీలు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ కార్పొరేషన్ రుణాల కోసం 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వారిలో ఎంతమందికి రుణాలు ఇచ్చారు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. బీసీ సబ్ ప్లాన్ పై ఇప్పటివరకు స్పష్టత లేదని చట్టబద్ధత చేస్తామని 2017 లో హామీ ఇచ్చారని కానీ ఇప్పటివరకు అది అమలు కాలేదు అని ఆయన అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ కేవలం అలంకారప్రాయంగానే ఉందని ఈ కార్పొరేషన్ కింద ఏటా 1000 కోట్లు ఖర్చు పెట్టామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం 2018-19 75% రుణాలను ఖర్చు పెట్టలేదని అలాగే 2020-22లో 100% ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. బీసీ ఎంప్లాయిమెంట్ పరిస్థితి కూడా అంతేనని మూడేళ్లలో బీసీ వెల్ఫేర్ నిధులు లేక అస్తవ్యస్తంగా మారిపోయిందని మూడేళ్లలో కనీసం ఒక్క రూపాయి కూడా బీసీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు ఖర్చు పెట్టలేదు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చునని గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం 3005 కోట్లను కేటాయించి కేవలం 350 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టిందని ఆయన అన్నారు. 2014 నుండి 2022 వరకు బీసీ సబ్సిడీ రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 55,183.57 కోట్లు కేటాయించగా అందులో 17,231.75 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిందని అందులో ఖర్చు చేసింది కేవలం 6078.09 కోట్లు మాత్రమేనని ఇక ఎంబీసీ ల కోసం 335 కోట్లు కేటాయించగా మంజూరు చేసింది కేవలం 65.51 మాత్రమేనని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద విద్యార్థుల చదువు కోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం నీరుగారుస్తుందని గడిచిన 4,5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 5వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని వీటిలో బీసీ విద్యార్థులకు సంబంధించి 3000 కోట్లు కాగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి రెండు వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది స్కాలర్ షిప్ ల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఇకపోతే విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే బీసీ విద్యార్థుల కోసం బిసి ఓవర్సీస్ స్కాలర్షిప్లను ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం 3,000 మంది బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే కేవలం 300 మంది విద్యార్థులకు మాత్రమే ఇచ్చారని బిసి ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం గత బడ్జెట్లో 123 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది కేవలం 33 కోట్లు మాత్రమేనని ఆయన అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అడగడుగునా కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలపై కేసీఆర్ కపటప్రేమ నటిస్తున్నారని ఆయన అన్నారు. పైన పేర్కొన్న పథకాలన్నింటినీ సక్రమంగా అమలు చేస్తే బీసీలకు ఎంతో కొంత మేలు జరిగేదని కానీ వాటన్నిటిని పక్కనపెట్టి ఇప్పుడు కులవృత్తిదారులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అని జిత్తుల మారి ఉపాయంతో వస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బీసీలందరూ తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివ కుమార్,నగర ఓ బి సి అధ్యక్షులు నాగరాజ్,సంజీవ్ పాల్గొన్నారు.

Spread the love