చంద్రయాన్‌-3.. నాలుగో కక్ష్య పెంపు విజయవంతం

నవతెలంగాణ : బెంగళూరు: చంద్రుడిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన ‘చంద్రయాన్‌-3’ వ్యోమనౌక.. లక్ష్యం దిశగా సాగుతోంది. ఇప్పటివరకు మూడో కక్ష్యలో భూమిచుట్టూ చక్కర్లు కొట్టిన ఈ వ్యౌమనౌకకు సంబంధించిన నాలుగో కక్ష్య పెంపును అంతరిక్ష పరిశోధన సంస్థ గురువారం విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరులోని ‘ఇస్ట్రాక్‌’ కేంద్రం నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. చంద్రయాన్‌-3కి సంబంధించిన అయిదో, చివరి కక్ష్యను పెంచేందుకు జులై 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య చేపడతామని ప్రకటించింది. నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం. ఈ సందర్భంగా చంద్రయాన్‌-3ని జాబిల్లికి మరింత చేరువ చేస్తూ.. భారత్‌ ఈ వేడుక చేసుకుంటోంది’ అని ట్విటర్‌ వేదికగా ఇస్రో పేర్కొంది. జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇప్పటివరకు దశలవారీగా నాలుగుసార్లు పెంచి.. చంద్రయాన్‌-3 జాబిల్లికి చేరువచేస్తున్నారు. అయిదో కక్ష్య పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెడుతుంది.

Spread the love