బీజేపీ అసహనానికి ఇదే నిదర్శనం: చిదంబరం

నవతెలంగాణ – ఢిల్లీ: ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల లేఖ రాశారు. దీన్ని కర్ణాటకకు చెందిన నలుగురు భాజపా ఎంపీలు తీవ్రంగా విమర్శించారు. బీజేపీ ఎంపీల విమర్శలపై తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎలాంటి విమర్శలను సహించలేదని చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఖర్గే రాసిన లేఖకు ప్రతిస్పందనగా భాజపా ఎంపీలు విడుదల చేసిన లేఖలో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. సీబీఐ ఉన్నది నేరాలపై విచారణ జరపడానికని ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే అన్నారు. రైలు ప్రమాద ఘటనలపై దర్యాప్తు చేయడం సీబీఐ పని కాదన్నారు. సాంకేతిక, వ్యవస్థాగత, రాజకీయ వైఫల్యాలను సీబీఐ తేల్చలేదన్నారు. అలాగే రైల్వే భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నామంటూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందని విమర్శించారు. దీనిపై భాజపా ఎంపీలు తేజస్వీ సూర్య, పీసీ మోహన్‌, మునిస్వామి, సదానంద గౌడ ఘాటుగా స్పందించారు. వాట్సప్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన సమాచారంతో ప్రధానికి లేఖ రాయడం ఖర్గే స్థాయి నేతకు తగదని విమర్శించారు.

Spread the love