ఉలికిపాటెందుకు?

భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడిందని ”కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని సహా ఆపార్టీ ఎంపీలు, ముఖ్యమంత్రులు మాటల దాడి చేస్తూ రావణకాష్టంలా దానిని రగిలిస్తూనే ఉన్నారు. ఇంతకీ రాహుల్‌ ఇంగ్లాండ్‌లో చేసిన వ్యాఖ్యలేంటి? భారత్‌లో స్వేచ్ఛ ప్రమాదంలో ఉందన్నారు. పార్లమెంటులో మాట్లాడిన మాటలు కూడా మాయం అవుతున్నాయన్నారు. ఒక ఆరెస్సెస్‌ కార్యకర్త కూతురుగా చెప్పుకున్న జర్నలిస్టు ప్రశ్నకు జవాబుగా కదా!? బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించి ఈ ఎనిమిదిన్నర ఏండ్ల కాలంలో గ్రీన్‌ పీస్‌, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఆక్స్‌ ఫామ్‌ వంటి సంస్థలు పనిచేసే పరిస్థితులు లేకుండా చేసిన భారత ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఎవరైనా కలిగించగలిగే అప్రదిష్ట ఏముంది? సుభిక్షంగా ఉన్న దేశంపై రాహుల్‌ గాంధీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ ”రాహుల్‌ గాంధీ భారత్‌కు చెందిన పౌరుడు కాదు. ఆయన తల్లి ఇటలీకి చెందిన వ్యక్తి. ఆయనకు ఈ దేశ రాజకీయాల్లో చోటు లేదు. ఇలాంటివాడిని దేశం నుంచి వెళ్లగొట్టాలి” అని వ్యాఖ్యానించారు. కేవలం ఈ మాటలకే రాహుల్‌ గాంధీని దేశం నుంచి వెళ్లగొడితే అంతకంటే విద్వేష వ్యాఖ్యలు చేసి మత కల్లోలాలకు కారణమైన కమల నాథులకు, దేశానికి అన్నం పెట్టే రైతులపై కాన్వారు తోలి తొమ్మిది మంది రైతులను పొట్టన పెట్టుకున్న కేంద్ర మంత్రి కుమారుడికి ఏం శిక్ష వేయాలి? గౌరవ ప్రధాన మంత్రి 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకంటే ముందున్న ప్రభుత్వాలను అగౌరవపరుస్తూ అమెరికాలో, కెనడాలో, జర్మనీలో మాట్లాడుతూనే వచ్చారు. పోయిన ప్రభుత్వాలు అంతా పాడుచేసి పోయాయి, మేం వచ్చి అంతా బాగు చేసుకోవలసి వస్తోందని స్వయంగా ప్రధానే విదేశీ వేదికల మీద అనేకసార్లు మాట్లాడారు. అప్పుడు కాంగ్రెస్‌ ఆ మాటలను తప్పు పట్టింది. ప్రధానిగా విదేశాలకు వెళ్లినప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలి కానీ, పార్టీకి కాదు అంటూ వ్యాఖ్యలు చేసింది. అది కూడా సరైన స్పందన కాదు. విమర్శను ఎక్కడి నుంచైనా ఎదుర్కొనాలి. ఎక్కడైనా సమాధానం ఇవ్వాలి. చేసిన విమర్శకు సమాధానం చెప్పకుండా వంకర వాదనలు చేస్తే ఏమిటి ఉపయోగం?

దేశంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపడం, పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించడం దేశ ప్రతిష్టకు భంగం కలిగించడం ఎలా అవుతుందో ఏలిన వారికే తెలియాలి. ”ఏ దేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అని రాయప్రోలు అన్నాడంటే దేశంలోని సమస్యలను ఎత్తిచూపొద్దని కాదు. కానీ, ఇక్కడ సమస్య ఏమిటంటే, దేశమూ, దేశాన్ని పాలించే పాలకులూ ఒకటేనా? దేశంలో సమస్యలను ప్రస్తావిస్తే, దేశం గురించి చెడు మాట్లాడినట్టా? పాలకులు గురించి కానీ, వారి పాలన గురించి కానీ మాట్లాడితే అదేమైనా దేశద్రోహమా? వాస్తవ పరిస్థితిని అంగీకరించక పోతే దిద్దుబాటుకు అవకాశం ఎక్కడ ఉంటుంది? ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండడానికి కావలసిన పార్లమెంటు సవ్యంగా పనిచేయడం, మీడియాకు స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం, ఆలోచనలను వెల్లడించే అవకాశం లేకుండా పోతున్నాయని రాహుల్‌ అన్న మాటలో అవాస్తవం ఉందనడానికి విమర్శలకు దిగిన బీజేపీ నాయకులు ఒక్క రుజువూ చూపలేదు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మనం ఐదవ స్థానంలో ఉన్నామని మోడీ ఊదర కొడుతున్నారు. కానీ, 194 దేశాల తలసరి ఆదాయ సూచీలో భారత్‌ 144వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆకలి సూచీలో కూడా 121 దేశాలలో భారత్‌ 107వ స్థానంలో ఉంది. ఈ విషయంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మైన్మార్‌, శ్రీలంకలు కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛలో మనం 135వ స్థానం నుంచి 150వ స్థానానికి దిగజారాం. ఇది చాలదా భారత ప్రజాస్వామ్య చక్కదనం తెల్పడానికి!

Spread the love