లైన్‌ క్లియర్‌

మబ్బు పట్టిన సాయంత్రపు వాతావరణం. దట్టమైన మేఘాలతో చీకటి కొంచెం ముందుగానే ఆవరించింది. ఆ మేఘం కుండపోతగా వర్షిస్తుందా లేక ఉరిమి ఉరిమి ఊరికనే చల్లబడుతుందా అని అయిదో ఫ్లోర్‌ లోని అపార్ట్‌మెంట్‌ బాల్కనీ లో కూర్చొని ఆలోచిస్తున్నాను నేను. వర్షం కురిస్తే చూసి పులకరించాలని నా మనసు కూడా తహ తహలాడుతోంది. వర్షం కురవకపోయినా, ఈ వాతావరణం లోని చల్లదనం, నల్లని మేఘాలు నన్ను అంతే పరవశున్ని చేస్తాయి.
కానీ వర్షం రాకుండా ఉరుములు మెరుపులతో గాలి మాత్రమే వీస్తే, లేదా పెద్ద గాలి వాన వస్తే ఎలా అనే చిన్న ఆందోళన, అలజడి కమ్ముకుంది నాలో.. ఒకప్పుడైతే, అంటే ఈ ఉద్యోగంలోకి రాకముందు నాకు గాలి వాన పట్ల సదభిప్రాయమే ఉండేది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. మొదటిది గాలి వాన వస్తే ప్రకతి స్థంభించి పోయి, అన్ని కార్యకలాపాలు నిలిచిపోయి ఇంట్లోనే ఉండిపోవొచ్చు. బహుశా నా చిన్నప్పుడు గాలివాన వచ్చినప్పుడు మా బడికి ఇచ్చిన సెలవుల వల్ల నేను ఈ రకమైన అభిప్రాయం ఏర్పరుచుకున్నానేమో. రెండో కారణం ‘పాలగుమ్మి పద్మరాజు’ గారు రాసిన ‘గాలి వాన’ కథ. గాలి వీస్తూ వాన మొదలవగానే ఆ కథలోని సన్నివేశంలోకి ప్రవేశించి ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాను. ఇలా కారణాలు చాలా ఉన్నప్పటికీ, అదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. గాలి వాన మొదలైతేనే నా వెన్నులో సన్నగా వొణుకు మొదలవుతుంది. దీనికి కారణం నా ఉద్యోగం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్లో ఇంజనీర్‌ ఉద్యోగం అంటే చూసే వాళ్లకి మహా దర్జాగా కనిపిస్తుంది. అందులోని సాధక భాధకాలు మాకే తెలుస్తాయి. ఆ మాటకొస్తే ఏ ఉద్యోగంలోనైనా అంతేనేమో. కానీ మా కరెంటోళ్ల కష్టాలు, అందునా పోల్‌ ఎక్కి పని చేసే హెల్పర్‌, లైన్‌ మెన్‌ ల కష్టాలు చెపితేనే తప్ప ఎవ్వరికీ అర్థం కావు. ‘గాలి వాన’ మొదలయ్యిందంటే మా వొంట్లో తెలియని భయం ప్రవేశిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు గాలి వాన వస్తే ముందుగా కరెంటు పోతుంది. సబ్‌ స్టేషన్‌ కు ఫోన్‌ చేసి ఫ్యూస్‌ పోయిందో, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలి పోయిందో, లైన్‌ తెగి బ్రేక్‌ డౌన్‌ అయ్యిందో కూడా తెలుసుకొనే అవకాశం ఇవ్వకుండా మోగుతుంది మొబైల్‌. రెగ్యులర్‌ సమస్యలే కాకుండా ఒక్కోసారి పోల్లు కూడా విరగొచ్చు. అప్పుడు నాకు, మా స్టాఫ్‌ అందరికీ రాత్రంతా జాగారమే. అదేంటో కరెంటు ఇరవై నాలుగు గంటలు పోకుండా ఎన్ని రోజులు ఉన్నా జనాలకు మేము గుర్తుకు రాం. కానీ కరెంటు పోయిన మరుక్షణం బండ బూతులతో మమ్మల్ని గుర్తుకు చేసుకుంటారు. ఇప్పుడు నా మొబైల్‌ ఇంకా మోగట్లేదంటే ఏ ఏరియాలో కూడా కరెంటు పోలేదని అర్థం. నా మొర దేవుడు ఆలకించాడేమో గాలి తగ్గి సన్నని వర్షం మొదలయ్యింది. ఇంక కరెంటు పోదు. బయటకు వెళ్లే గండం తప్పిందని ఊపిరి పీల్చుకున్నాను. నాకెందుకో ‘లైన్‌ మన్‌ మల్లయ్య’ యాదికొచ్చిండు. గాలి వాన వచ్చినా, లైన్‌ బ్రేక్‌ డౌన్‌ అయ్యి కరెంటు పోయినా నాకు మల్లయ్య మనసులో మెదలటం సహజమే. మన ఆలోచనలకు కూడా భాష ఉంటుందేమో. మల్లయ్య యాదికి రాంగానే నాకు అతని మలినం లేని మనసు, అచ్చ తెలంగాణ యాసతో చెప్పే సామెతలు గుర్తుకొస్తాయి. ఒక్కసారిగా మల్లయ్యతో పరిచయం జరిగిన ఇరవై ఏళ్ల కిందికి నా ఆలోచనలు గిర్రున వెనక్కి మళ్ళినయి.
– ఇంజనీరింగ్‌ చదువు పూర్తి కాగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌’ ఉద్యోగం వచ్చింది. జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలోని చిన్న మండలంలోని సబ్‌ స్టేషన్‌లో పోస్టింగ్‌. కొత్త ఉద్యోగం, కొత్త స్థలం కావటంతో కొంచెం బిడియం, కొంచెం భయంతో మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళాను. సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ స్టాఫ్‌ అందరినీ పరిచయం చేసాడు. ”సార్‌, వీళ్లిద్దరు లైన్‌ మెన్లు, వాళ్లిద్దరు అసిస్టెంట్‌ లైన్‌ మెన్లు. వీళ్లు గాకుండా ఇంకో ఆరుగురు ‘విలేజ్‌ ఎలక్ట్రిసిటీ వర్కర్లు’ మన మండలం కింద వచ్చే ఆయా ఊళ్ళల్ల ఉంటరు. వాళ్ళే మనకు హెల్పర్‌ లెక్క పని జేత్తాండ్రు. ఏదన్న పని ఉంటేనే సబ్‌ స్టేషన్‌ కు వత్తరు వాళ్లు. లేకపోతే ఎప్పుడన్న బిల్లు వసూల్లకు ఆ ఊళ్ళల్లకు పోయినప్పుడు మీకు గాళ్ళను పరిచయం జేత్తా” అని వివరించాడు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌. ఆ రోజు మధ్యాహ్నం హెల్పర్లుగా పిలవబడే ‘విలేజ్‌ ఎలక్ట్రిసిటీ వర్కర్లు’ ఇద్దరు వచ్చి నాతో పరిచయం చేసుకొని, వాళ్ళ ఊళ్ళో ఏదో సమస్య ఉందని ఒకరు కండక్టర్‌ వైర్‌ ముక్క కావాలని, ఇంకొకరు ఇన్సులేటర్‌ కావాలని అడిగితే, స్టోర్‌ రూమ్‌ లో నుండి తీస్కోమ్మని, రిజిస్టర్‌ లో రాసి ఇచ్చాను. మరుసటి రోజు మరో ఇద్దరు వచ్చారు. మొదటి వ్యక్తి పరిచయం చేసుకొని ”సార్‌, పొద్దున్నే లారీ గుద్ది పోల్‌ ఇరిగింది. పోల్‌ మార్చాలంటే ఎల్‌.సి కావాలి జర ఇప్పియ్యుండ్రి” అన్నాడు. ఎల్‌.సి అనే పదం అంతకు ముందు నేనెప్పుడూ వినలేదు. ఇంజనీరింగ్‌ చదువులో కూడా తారసపడినట్లు గుర్తుకు రావటం లేదు. సహజంగానే అదేదో వస్తువు అనుకొని ”స్టోర్‌ రూమ్‌ లోకి పొయ్యి తెచ్చుకో” అన్నాను. అంతే ఆ హెల్పర్‌ బిగ్గరగా ”అయ్యో సారూ మీకు గదేందో గూడ తెల్వదా, ఎట్ల ఉద్యోగం ఇచ్చిండ్రు మీకు” అంటూ హేళనగా నవ్వసాగాడు.
అంతే, ఆ పక్కన వ్యక్తి ”అరే చుప్‌. సార్‌ పెద్ద ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ల చదివిండు. ఎంతో తెలివైనోడు. నీకేం తెలుసని నవ్వుతానవ్‌ రా తాలుగా..” అని నాకేసి తిరిగి.. ”సార్‌. ఎల్‌.సి అంటే ‘లైన్‌ క్లియర్‌’. అంటే లైన్‌ బంద్‌ చేయనీకి పర్మిషన్‌ అన్నట్లు. ఒకసారి ఎవలకన్న ఒక లైన్‌ ఎల్‌.సి ఇస్తే మల్ల అదే మనిషి సబ్‌ స్టేషన్‌ కి వచ్చి ఆ ఎల్‌.సి రిటర్న్‌ చేసేదాకా ఆ లైన్‌ అస్సలు ఆన్‌ చెయ్యరు. గిసువంటియి మీ సదువుల లేకపోవొచ్చు. ముందు ముందు అన్నీ అవే తెలుస్తయి. మీరేం ఫికర్‌ చెయ్యకుండ్రి. ఒట్టి గొడ్డుకు అరుపులెక్కువ అన్నట్లు వాడు గట్లనే నవ్వుతడు. కొన్ని దినాలు పోయినంక అన్నీ మీకు సమజ్‌ అయితయి. మీకే డౌట్‌ వచ్చిన నేను చెప్తా గదా” అంటూ పరిచయం చేసుకున్నాడు ‘హెల్పర్‌ మల్లయ్య’. మొదటి పరిచయంలోనే నన్ను అతని వ్యక్తిత్వం ఆకట్టుకుంది. నేను వాళ్ళ కంటే వయసులో చిన్న అయ్యి వాళ్లకు అధికారిగా ఉండటం జీర్ణించుకోలేని లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, లైన్‌ మెన్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు సహాయంగా ఉండాల్సింది పోయి ఆ సమస్యను ఇంకా జఠిలం చేసి వినోదం చూసేవాళ్ళు. మల్లయ్య మాత్రం నా హోదాను గౌరవిస్తూనే నాకు అన్నీ తెలియచేసి పరిష్కార మార్గాలు చెప్పేవాడు. అంతే కాదు మల్లయ్య పర్మనెంట్‌ ఉద్యోగి కాకపోయినా, అతనికిచ్చే జీతం చాలా తక్కువే అయినా అస్సలు లంచం తీసుకొనేవాడు కాదు. అందువల్ల మిగతా స్టాఫ్‌ అందరూ మల్లయ్య పట్ల కొంచెం భయం, గౌరవం కలిగివుండేవారు. పోల్‌ ఎక్కినప్పుడో, ట్రాన్స్‌ఫార్మర్‌ మార్చినప్పుడో రైతులు సంతోషంగా ఏదైనా డబ్బులు ఇచ్చినా సున్నితంగా తిరస్కరించే వాడు. ”మల్లయ్యా, నువ్వేం వాళ్ళను డబ్బులు డిమాండ్‌ చెయ్యలేదు. వాళ్ళే ఏదో ఫార్మాలిటీగా ఇష్టంతో ఇస్తున్నారు. అయినా ఎందుకు తీసుకోవు” అని అడిగాను ఒకసారి. ”సార్‌. అట్ల తీసుకుంటే అది పాపపు సొమ్ము. నాకొద్దు అది. అన్యాలంగా సంపాదించి మీదేస్కపోతమా ఏమన్న. నాకు నా ఈ హెల్పర్‌ ఉద్యోగం పెర్మనెంట్‌ అయితే చాలు. ఇంకేం వొద్దు. ఈ కరెంటు డిపార్ట్‌మెంట్‌ నాకు బుక్కెడు బువ్వ పెడుతోంది. లంచం తీస్కొంటే, కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లే. ఆ తప్పు నేను చెయ్యలేను” అన్నాడు. ”నువ్వు, నేను తీసుకోకపోతే ఏమన్న ఆగుతాందా. మిగతా స్టాఫ్‌ ఏదీ వదిలిపెట్టట్లే గదా. నువ్వే సూడు నీ తోటి హెల్పర్లు కూడా మండలం ల ఇళ్ళు, ప్లాట్లు సంపాదించుకున్నరు, బైక్‌ పై తిరుగుతున్నారు. నీకేం లేకపాయె ఆ డొక్కు లూనా తప్ప” అన్న మల్లయ్య ఏమంటడో ఇందామని. ”మీ ఆలోచన తప్పు సార్‌. నూనెల ఎంత బొర్లిన అంటుకునేటంతనే అంటుకుంటది. పైనోడు అన్నీ సూత్తనే ఉంటడు. లెక్క సరిజేత్తడు ఎప్పటికైనా. అయినా నియతిగ బతుకుట్ల ఉన్న తప్తి వేరు” అన్నడు. నాకెందుకో ఆ సమయంలో మల్లయ్య హిమాలయాలంత ఎత్తుకి ఎదిగినట్లు కనిపించిండు. ఆ తరువాత కొద్ది రోజులకు మల్లయ్య గురించి తెలిసిన ఒక అరుదైన విషయం నన్ను విస్మయానికి గురి చేసింది. ఆ రోజు మధ్యాహ్నం మల్లయ్య ఉండే ఊరిలోనే మినిస్టర్‌ ప్రోగ్రాం. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి కరెంటు పోకుండా చూసుకోవాల్సిన భాద్యత మాదే కనుక రెండు గంటల ముందే ఆ ఊరు చేరుకున్నాను. సడన్‌ గా మొదలయ్యింది గాలివాన. పదే పది నిముషాలు విధ్యంసం చేసి పోయింది. కరెంటు పోయింది. లైన్‌ బ్రేక్‌ డౌన్‌. అదష్టవశాత్తు పోల్లు ఏమీ ఇరగలేదు కానీ ఊరి పొలిమేరలో చెట్టు పడి లైన్‌ తెగింది. మినిస్టర్‌ రావటానికి ఇంకా గంట టైమ్‌ మాత్రమే ఉంది. చెట్టు తొలగించి లైన్‌ మళ్ళీ గుంజటానికి ఆ సమయం చాలు. కానీ ‘ఎల్‌.సి’ తీసుకొని పని చెయ్యాలి. ‘ఎల్‌.సి ‘ తీసుకోవాలంటే సబ్‌ స్టేషన్‌ కు పోవాలి. పొయ్యి రావటానికే గంట సమయం పడుతుంది. నాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. టెన్షన్‌ పెరిగిపోయింది. అప్పుడు మల్లయ్య ”సార్‌ మీరేం గాభరా పడకుండ్రి. నేను చూసుకుంటా. ఎల్‌. సి లేకుండా నేను పోల్‌ ఎక్కుతా” అన్నాడు. ”మల్లయ్యా…ఎల్‌.సి తీస్కోకుంటే వాళ్లు ఆన్‌ చేసి సప్లై వస్తే నీ ప్రాణాలకే ప్రమాదం” అన్నాను. ”అయ్యో సారూ.. మీకు ఈ సంగతి తెల్వదు కదా. నాకు అస్సలు షాక్‌ కొట్టదు. అది లెవెన్‌ కె.వి లైన్‌ అయినా, ఎల్‌.టి లైన్‌ అయినా నాకు షాక్‌ కొట్టదు” అన్నాడు. ”అదెలా..” అని అడిగాను ఆశ్చర్యంగా.. ”అదంతే సార్‌. నా బ్లడ్‌ గ్రూప్‌ కోట్లల్ల ఒక్కలికి ఉంటదట. అందుకే షాక్‌ కొట్టదట. నాకు అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటా” అని.. ఊళ్ళో జె.సి.బి తెప్పించి చెట్టు తొలగించి చక చకా పోల్‌ ఎక్కి లైన్‌ గుంజి, సబ్‌ స్టేషన్‌ కు మనిషిని పంపించి సప్లై ఆన్‌ చేపించిండు. మినిస్టర్‌ ఊళ్ళో అడుగు పెట్టేసరికి కరెంట్‌ వచ్చింది. అంతకు ముందు అలా ఎన్నోసార్లు ‘ఎల్‌.సి’ లేకుండా పని చేసి డిపార్ట్మెంట్‌ కు ఎంతో విలువైన సమయాన్ని, డబ్బుని ఆదా చేసాడని తెలిసి అచ్చెరువొందాను. ఆ మనిషి వ్యక్తిత్వం తో పాటు, వ్యక్తిగా కూడా చాలా అరుదైన వాడు అనిపించింది ఆ క్షణం. ”మల్లయ్యా.. నీకు షాక్‌ కొట్టదని తెలిసినా మరి పోల్‌ ఎక్కినప్పుడు సేఫ్టీగా ఎర్తింగ్‌ చేస్కుంటావు, ఇండక్షన్‌ వస్తుందా అని చెక్‌ చేసుకుంటావు ఎందుకు” అని అడిగాను. ”నిజానికి నాకు అవి అవసరం లేవు సార్‌. కానీ మన స్టాఫ్‌ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోక పోబట్టే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన కరెంటోళ్ళ జీవితాలు గాల్లో దీపం లాంటివి. పది మందికి మనం ఏదన్న మంచి చెప్పాల్నంటే, ముందు అది మనం ఆచరించాలి కదా సార్‌. అందుకే నేను నాకు అవసరం లేకపోయినా ఎర్తింగ్‌ చేస్కుంటా, ఇండక్షన్‌ చెక్‌ చేస్కుంటా” అన్నాడు మల్లయ్య. తర్వాత అక్కడ పని చేసినన్ని రోజులు ఎప్పుడు గాలి వాన వచ్చినా భయపడలేదు నేను. ప్రతి సమస్యకు మల్లయ్య దగ్గర పరిష్కారం ఉండేది. ఇంకోసారి భీకరమైన గాలి వాన వచ్చి పోల్లన్నీ ఇరిగి దాదాపు మూడు రోజుల తర్వాత అన్ని గ్రామాలకి కరెంటు ఇవ్వగలిగాం. ఆ సమయంలో జనాలు రోజు సబ్‌ స్టేషన్‌ కు వచ్చి మమ్మల్ని విపరీతంగా తిట్టేవారు. అప్పుడు నేను కొంచెం బాధలోకి పోయి ”మల్లయ్యా మనం ఎంతో కష్టపడుతున్నాం. ఎన్నోసార్లు కరెంటు పోకుండా చూసుకున్నాం. అయినా ఇప్పుడు ఒక్కసారి లేట్‌ అయితే జనాలు ఎందుకు అర్ధం చేసుకోవటం లేదు” అన్నాను. ”సార్‌. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. మీరెక్కువ ఆలోచించకుండ్రి. జనాలకి మన కష్టం తెలవదు. వాళ్ళ తప్పు గూడ ఏం లేదు. కరెంటు పోతే వాళ్ళ అవస్థ వాళ్ళది. అందుకని మన పని మనం నీతి తప్పకుండా చెయ్యాలి. ఫలితం గురించి విచారించొద్దు” అని మల్లయ్య ఎంతో పరిణితితో చెప్పిన మాటలు జీవితాంతం మర్చిపోలేను. ఉద్యోగంలోనే కాకుండా, కుటుంబ జీవితంలో, సొసైటీలో కూడా మల్లయ్య అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేవాడు. బిడ్డ ఇంజనీరింగ్‌ చదువుతోంది. కొడుకుకు చదువు అబ్బలేదు. ఐటిఐ లో చేర్పించిండు. ఉద్యోగం పర్మనెంట్‌ కాకపోయినా, బొటా బొటి జీతం వచ్చినా మల్లయ్య అంత సంతోషంగా, ఆత్మ విశ్వాసంగా ఎలా ఉండగలుగుతున్నాడా అని ఆలోచించేవాన్ని. అదే విషయం అడిగానొకసారి. ”ఏమో సార్‌ ఇరవై ఏండ్ల నుండి విలేజ్‌ వర్కర్‌ గానే టెంపరరీగా పని చేస్తున్నా. పర్మనెంట్‌ కాలేదనే బాధ ఎప్పుడు కలగలేదు. ‘కరెంటు మల్లయ్య’ అని అందరు పిలుత్తాంటే నాకు సంబరం అయితది. ఎంత చెట్టుకు అంత గాలి. రేపో మాపో పర్మనెంట్‌ అయ్యితదని యూనియనోళ్లు అంటుండ్రు. ఇంజనీరింగ్‌ చదువుకునే నా బిడ్డ మంచి నౌకరి సంపాదిస్తే అదే చాలు. కొడుకు ఐటిఐ చేత్తాండు. తెలంగాణ వస్తే కొత్త కొలువులు వత్తాయట గదా. వానికి ఈ కరెంటు దాంట్లనే ఏదన్న నౌకరి దొరికితే నాకు ఇంకేం వొద్దు” అన్నాడు. తొందరగా మల్లయ్యకు ఉద్యోగం పర్మినెంట్‌ కావాలని కోరుకున్నాను ఆ దేవుణ్ణి నేను. నేను కోరుకున్నట్లుగానే అదే సంవత్సరం ఒక రోజు ”విలేజ్‌ ఎలక్ట్రిసిటీ వర్కర్స్‌” గా పని చేస్తున్న అందరు హెల్పర్లను పర్మనెంట్‌ చేసి ”జూనియర్‌ లైన్‌ మన్‌” గా నియమిస్తూ మా డిపార్ట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చింది. ఇరవై ఏళ్ల చాకిరీ తరువాత, నలభై మూడేళ్ల వయస్సులో వచ్చిన ఉద్యోగాన్ని చూసి మల్లయ్య ఆనందానికి అవధులు లేవు. అదే రోజు క్యాంపస్‌ సెలక్షన్‌ లో తన కూతురుకి మంచి ఎం.ఎన్‌.సి లో పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని తన సంతోషం రెట్టింపు అయ్యిందని మాతో చెప్పాడు. కానీ అతని ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. మల్లయ్య కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని కుటుంబంతో తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోయింది. కానీ ఆ విషయాన్ని అతను పెద్దగా పట్టించుకోలేదు.
”సార్‌, కష్టపడి చదివించాను. దాని తమ్ముడికి ఏదైనా ఆదెరువు దొరికేవరకైనా నాకు అండగా ఉంటుందని అనుకున్నాను. అయినా మనం పిల్లలని కంటాం కానీ వాళ్ళ బుద్దుల్ని కనలేం కదా. ఇంక నాకు ఒక్కడే కొడుకని అనుకుంటా” అని నవ్వుతూ చెప్పాడు. అతని మనోనిబ్బరానికి ఆశ్చర్యపోయాను. ఎంతో కష్టపడి, నిజాయితీగా పని చేసే మల్లయ్యకు పంద్రాగస్టు సందర్భంగా కలెక్టర్‌ ఇచ్చే ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇప్పించమని మా ‘డివిజనల్‌ ఇంజనీర్‌’ కు సిఫార్సు చేసాను నేను. అదే విషయం మల్లయ్యకు చెప్పి ”నీకంటే సిన్సియర్‌ గా పని చేసే స్టాఫ్‌ డివిజన్లో ఎవ్వరు లేరు కాబట్టి, ఈ సారి అవార్డు నీదే” అన్నాను. ”మీరు దేవుడు సార్‌. పని చేసినా గుర్తించి వెన్ను తట్టే అధికారులు ఈ రోజుల్లో తక్కువైపోయారు. మీ దగ్గర పని చెయ్యటం నా అదష్టం” అన్నాడు. కానీ అనూహ్యంగా ఆ అవార్డు వేరే ఉద్యోగికి ప్రకటించారు. షాక్‌ అయ్యాను నేను. మా డి.ఇ కి ఫోన్‌ చేస్తే ”అవును ఏ.ఇ గారు, మల్లయ్య నిస్సందేహంగా గొప్ప వర్కర్‌. కానీ మూడు యూనియన్లు ఉన్నాయి. రొటేషన్‌ పద్ధతిలో ఒక్కో సంవత్సరం ఒక్కో యూనియన్‌ ఎంప్లారు ని సిఫార్సు చేస్తున్నాం. అతనికి వచ్చే సంవత్సరం కచ్చితంగా ఇప్పిద్దాం” అన్నాడు. బాధపడుతూ అదే విషయం చెప్పాను మల్లయ్యకు. కానీ అతను మాత్రం నవ్వుతూనే ”అయ్యో సార్‌, మీరెందుకు బాధవడుతుండ్రు. ఆ అవార్డు కోసం మనం పని చెయ్యం కదా. అయినా మన ఎంప్లారు ఎవ్వలకు వచ్చినా అది మనందరికీ వచ్చినట్లే. మీరు గుర్తించిండ్రు నన్ను, నాకది చాలు” అన్నాడు. ఈ సారి అతనిలోని సానుకూల దక్పథం నన్ను ఇంకా ఆకట్టుకుంది. అదే సబ్‌స్టేషన్‌లో నాలుగేండ్ల సర్వీస్‌ పూర్తి కావటంతో నన్ను జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ కు బదిలీ చేశారు. నేను రిలీవ్‌ అయిన రోజున మల్లయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. ”సార్‌, వయసులో చిన్న వారైనా మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. అప్పుడప్పుడు మాట్లాడుతుంట సార్‌ మీతో” అన్నాడు. ”లేదు మల్లయ్య. నేనే నీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నన్ను చాలా విషయాల్లో ప్రభావితం చేసావు. నిన్నెప్పటికీ మర్చిపోలేను” అని సెలవు తీసుకున్నాను. ఆ తరువాత రోజులు గడిచే కొద్దీ నేను కూడా అసోసియేషన్‌ లో చిన్నపాటి లీడర్‌ కావటం, ఏ.ఇ నుండి ఏ.డి.ఇ ప్రమోషన్‌ పొందటం జరిగింది. నేను ఎక్కడున్నా మల్లయ్య గురించి వాకబు చేస్తూనే వున్నాను. ”జూనియర్‌ లైన్‌ మన్‌” నుండి ”లైన్‌ మన్‌” వరకు ప్రమోషన్‌ పొందిన ‘హెల్పర్‌ మల్లయ్య’ అలియాస్‌ ‘కరెంటు మల్లయ్య” ఇప్పుడు ”లైన్‌ మన్‌ మల్లయ్య” గా మారిపోయాడు. అయినా అతని పని తీరులో కానీ, వ్యక్తిత్వం లో గానీ ఎలాంటి మార్పు లేదు. నెలకోసారైనా నాకు ఫోన్‌ చేసి యోగ క్షేమాలు అడుగుతుంటాడు. ఎప్పుడు జీవితం పట్ల ధైర్యంగా, ఆశవాద దక్పధంతో ఉండే మల్లయ్య మాటల్లో ఈ మధ్య కొంచెం నిర్వేదం కనిపిస్తోంది. నెల క్రితం ఫోన్‌ చేసినప్పుడు ”సార్‌ మనకు ఈ.పి. ఎఫ్‌ ఉన్నోళ్లకు పింఛన్‌ రాదట గదా. గట్లయితే ఎట్ల సార్‌” అన్నడు. ”అందరితో పాటు మనం. ఏం జేస్తాం.” అన్నాను. ”మీరే అట్లంటే ఎట్ల సార్‌. రిటైర్‌ అయినంక మన పరిస్థితి ఏంది. ఇల్లు ఎట్ల గడవాలే, నాకు నా పెళ్ళానికి మందులకు పైసలు ఎక్కడ్నించి తేవాలి” అన్నాడు. ”ఈ. పి. ఎఫ్‌ డబ్బులు వస్తాయి గదా. ఈ. పి. ఎఫ్‌ పెన్షన్‌ కూడా వస్తది” అన్నా. ”చచ్చిపోయిన బర్రె పల్గిపోయిన బుడ్డెడు పాలిచ్చినట్లు… గా ఈ. పి. ఎఫ్‌ పైసలు యాడికి మోపయితయి సార్‌. ఉద్యోగం పర్మనెంట్‌ కాంగానే హౌసింగ్‌ లోన్‌ పెట్టిన. గా ఇన్‌స్టాల్మెంట్‌ రిటైర్‌ అయినంక ఎట్ల కట్టాలె. తల్సుకుంటే రంధి అయితాంది సార్‌” అన్నాడు. ”ఈ సమస్య నీ ఒక్కనిదే కాదు మల్లయ్య. ఎంతో మందిది. నువ్వు ఎక్కువ ఆలోచించకు” అన్నా. ”అందరు వేరు సార్‌. నేను సర్వీస్‌ లో అందరి లెక్క ఒక్క రూపాయి కూడా ఎనకేసుకోలేదు. డొనేషన్లు కట్టి కొడుకును పెద్ద సదువులు సదివియ్యలేదు. అందరిలెక్క కొడుకును అమెరికా పంపియ్యలేదు. నీతిగా, నిజాయితీ గా బ్రతికిన. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామాకాలు అన్నరు. ఎక్కడ ఇచ్చిండ్రు సార్‌ కొలువులు. నా కొడుక్కి జె.ఎల్‌.ఎం నౌకరి రాకపోయే. వాడు చిన్న ప్రైవేట్‌ నౌకరి చేయబట్టే. నేను రిటైర్‌ అయినంక వాని మీద ఆధార పడలేను. ఇంకో రెండు సంవత్సరాల్లో రిటైర్‌ అయిత. తల్చుకుంటే భయం అయితాంది. అంతా అయినోళ్లే గానీ తాగడానికి శారెడు మంచి నీళ్లు పుట్టయి అన్నట్లు ఉంది నా పరిస్థితి. అయినా పింఛన్‌ ఇస్తే డిపార్ట్‌మెంట్‌కు వచ్చే నష్టం ఏంది సార్‌” అన్నాడు. ”మల్లయ్యా, నీ ఆవేదనలో అర్ధం ఉంది. కానీ అది ప్రభుత్వం యొక్క పాలసీ. పింఛన్‌ ల వల్ల అధిక భారం పడుతుందని నిపుణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు జి.పి.ఎఫ్‌ రద్దు చేసి ఈ. పి. ఎఫ్‌ పింఛన్‌ ప్రవేశ పెట్టిండ్రు. 2004 సంవత్సరం తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది” అని చెప్పాను కానీ నాక్కూడా పింఛన్‌ రాకపోతే భవిష్యత్తు ఎలా అనే భాద లోపల ఉండనే ఉంది. ”అయినా సార్‌ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ ల 1999 నుండే పింఛన్‌ తీసేసిండ్రు గదా. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 2004 నుండి తీసేసిండ్రు. మనం గప్పుడే 2003లో వచ్చినం గదా” అన్నాడు. ”అందుకే మల్లయ్య, మనం ముందు 1999 నుండి 2004 మధ్య నియమితులైన ఉద్యోగులను ఈ. పి. ఎఫ్‌ నుండి జి. పి. ఎఫ్‌ పింఛన్‌ పరిధిలోకి తీసుకురమ్మని పోరాడుతున్నాం” అని సర్ది చెప్పే ప్రయత్నం చేసాను. ”పోరాటం చెయ్యాలె సార్‌. ముందు మనం సాధించుకోవాలె. తర్వాత అందరు ఉద్యోగులకు కూడా రావాల్నని అడగాలె. మన ఉద్యోగులు అందరికీ పింఛన్‌ ఒక హక్కుగా ఉండాలె” అన్నడు. ”అందుకు ప్రభుత్వం ఒప్పుకోదు మల్లయ్య. పింఛన్లు ఇచ్చుకుంటా పోతే ఖాజానా ఖాళీ అవుతుంది అని వాళ్ళ అభిప్రాయం” ”అట్లెట్ల సార్‌, ముప్పై ఏండ్లు పని చేసే మనకు పింఛన్‌ ఇయ్యనప్పుడు, ఐదేండ్లు పని చేసే రాజకీయ నాయకులకు ఎందుకు సార్‌ పింఛన్‌” అని అడిగాడు సూటిగా. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నాకు. ”నువ్వు బాధపడకు. పది, పదిహేను రోజుల్లో మనకు పి.ఆర్‌.సి ఇస్తరంట. అందులో కనీసం మన బ్యాచ్‌ వరకు ఈ. పి. ఎఫ్‌ నుండి జి. పి. ఎఫ్‌ ఇచ్చే సానుకూల ప్రకటన రావొచ్చు” అని సముదాయించాను. ఏదో చెప్పిన గని పింఛన్‌ రాకపోతే నాలాంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే ఆందోళన నాలో కూడా మొదలయ్యింది. తరువాత మల్లయ్య ‘ఈ. పి. ఎఫ్‌’ టు ‘జి. పి. ఎఫ్‌’ ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిసింది.
వర్షం కొంచెం తగ్గినట్లు ఉంది. నా మొబైల్‌ రింగ్‌ కావటంతో మల్లయ్య ఆలోచనల నుండి బయటకి వచ్చాను. కొత్త నెంబర్‌ అది. ఎత్తి హాల్లో అన్నాను. ”సార్‌ నమస్తే. నేను లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహులు మాట్లాడుతున్నాను. మల్లయ్య చనిపోయాడు సార్‌. ఆ విషయం చెప్పుదామనే ఫోన్‌ చేసిన” అన్నాడు. ఒక్క క్షణం నాకేం అర్ధం కాలేదు. స్థాణువై పోయాను. నా గుండెను ఎవరో గునపంతో పొడిచేసినట్లు అయ్యింది. ”ఎప్పుడు, ఎలా?” అని మాత్రం అడిగాను.
”ఇప్పుడే సార్‌. గాలి వానకు లైన్‌ బ్రేక్‌ డౌన్‌ అయ్యింది. పోల్‌ ఎక్కి జారి పడిపోయాడు. స్పాట్‌ డెడ్‌”. ”ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టిందా” అని అడిగాను. ”లేదు సార్‌. మనోడికి షాక్‌ కొట్టదు కదా. అయినా ఎల్‌.సి కూడా తీసుకున్నాడు. వర్షానికి పోల్‌ మీద స్లిప్‌ అయినట్లుంది” అన్నాడు. ఫోన్‌ పెట్టేసి నిర్వేదంగా కూలబడిపోయాను. ఎన్నో జాగ్రత్తలు తీసుకొనే మల్లయ్య పోల్‌ మీద నుండి ఎలా జారి పడ్డాడో అర్థం కాలేదు. మరొక్కసారి వివరంగా మాట్లాడదామని మొబైల్‌ తీసాను. మెసేజ్‌ ఉంది మల్లయ్య నెంబర్‌ నుండి. ఆశ్చర్యంగా చూసాను. దాదాపు గంట కిందే ఆ మెసేజ్‌ వచ్చింది. మెసేజ్‌ ఓపెన్‌ చేసాను. ”సార్‌ నమస్తే. జీవిత పోరాటంలో ఇలా ఓడిపోతా అనుకోలేదు. మీరు ఈ మెసేజ్‌ చదివేసరికి నేను ఈ లోకంలో ఉండను. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు క్షమించగలరు. గత కొద్ది రోజులు గా నాకు పింఛన్‌ రాదు అనే విషయం ఎంతో మనాదికి గురి చేస్తోంది. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నా ఒక్క చావు రెండు సమస్యలకు పరిష్కారం. మొదటిది నాకు ఇంక పింఛన్‌ అవసరం లేదు. నా భార్యకు కూడా అవసరం లేదు. నేను మరణించాక వచ్చే ఇన్సూరెన్స్‌ డబ్బులు నా భార్యకు అందచేయగలరు. రెండోది కారుణ్య నియామకం ద్వారా నా కొడుక్కి వచ్చే నౌకరి. యూనియన్‌ వాళ్లు అది చూసుకుంటారు కానీ మీరు కూడా కొంచెం ఆ విషయంలో మా వాడికి ఏదైనా సహాయం అవసరం ఉంటే చెయ్యగలరు. ఇది నేను ఎంతో ఆలోచించి నా పింఛన్‌ సమస్య తీరటానికి తీసుకున్న నిర్ణయమే తప్ప పిరికితనంతో తీసుకున్న నిర్ణయం కాదని అర్థం చేసుకోండి. చివరగా మరొక్క విషయం… నేను పోల్‌ మీద నుండి ప్రమాదవశాత్తు పడటమే నా మరణానికి కారణం అని అందరూ అనుకుంటారు తప్ప కావాలనే పడిపోయాననే విషయం ఎవరి ఊహకి కూడా అందదు. దయచేసి ఈ రహస్యాన్ని మీలోనే దాచుకోండి.
సెలవు మీ మల్లయ్య.”
నా కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కురుస్తున్నాయి. ఎల్లప్పుడూ దృఢ చిత్తంతో ఉండే మల్లయ్య మొహమే నాకు కనిపిస్తోంది. వేల వోల్టుల కరెంట్‌ కు కూడా చలించని అతను, కూతురు దూరగా వెళ్ళిపోయినా తట్టుకున్న అతను, జీవితంలోని ఎన్నో సమస్యలను గుండె నిబ్బరంతో ఎదుర్కొన్న అతను, ఎందరికో ఎన్నో విషయాల్లో మార్గదర్శిగా నిలిచిన అతను, పింఛన్‌ సమస్యకు మాత్రం అత్మార్పణమే పరిష్కారం అనుకున్నాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ ‘లైన్‌ క్లియర్‌’ తీసుకోని అతను మొదటిసారి ‘ఎల్‌.సి’ తీసుకొని, తన పింఛన్‌ సమస్యకు, కొడుకు కొలువుకు ‘లైన్‌ క్లియర్‌’ చేసుకున్నాడు.
– మొగిలి అనిల్‌ కుమార్‌ రెడ్డి, 9059920159

Spread the love