మేదరులను సీఎం కేసీఆర్‌ గుర్తించి గౌరవించారు

– ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు
– హరితహారంలో వెదురు మొక్కలకు స్థానం :పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు
– ఆత్మగౌరవం కోసం కుటుంబానికి రూ.లక్ష :గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
నవ తెలంగాణ – సిద్దిపేట
మేదరి కుల, జాతిని గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదని, మీ ఆత్మగౌరవం నిలబెట్టి, జాతిని గుర్తించిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్‌ యార్డులో జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి మేదారి సంఘ భవనం రూ.30 లక్షలతో సిద్దిపేటలో నిర్మించుకున్నామని, సీఎం కేసీఆర్‌ హైదరాబాదులో ఎకరా స్థలాన్ని, కోటి రూపాయలను భవన నిర్మాణం కోసం కేటాయించారని అన్నారు. బ్యాంకుల చుట్టూ తిరగకుండా, అప్పులు చేయకుండా, 100 శాతం సబ్సిడీతో వృత్తిదారులకు సీఎం లక్ష రూపాయలు ఇస్తున్నారని అన్నారు. గతంలోని రూ.85 లక్షల అప్పులను మాఫీ చేయిస్తామని, వచ్చే నెల ప్రారంభం కానున్న గృహలక్ష్మి పథకంలో మేదరులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో కుల సంఘాలకు, కుల వృత్తులకు గుర్తింపు వచ్చిందన్నారు. హరితహారంలో వెదురు బొంగుల మొక్కలు నాటడానికి ప్రాధాన్యతను ఇస్తామన్నారు. బీసీల అభివృద్ధి కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. కులవృత్తులకు, కుల సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని, ప్రతి ఒక వర్గాన్ని గుర్తించి, గౌరవించి, నిధులను సీఎం కేసీఆర్‌ ఇస్తున్నారని అన్నారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసుకొని, ప్రత్యేక నిధులను ఇచ్చి, ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకున్నామని అన్నారు. కులవృత్తులను ప్రోత్సహించడానికి ప్రతి కుటుంబానికి రూ.లక్ష ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఎరుకల కులస్తుల కోసం ఈ మధ్యనే రూ.60 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో బీసీలకు ప్రత్యేక శాఖలేదని, రాష్ట్రంలో ఉందని అన్నారు. అనంతరం నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, సంగం నాయకులు తుమ్మల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love