వ‌చ్చే ద‌స‌రాకు సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 700 కోట్ల బోన‌స్ : సీఎం కేసీఆర్

నవతెలంగాణ మంచిర్యాల: సింగ‌రేణి కార్మికుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. వ‌చ్చే ద‌స‌రా బోన‌స్‌ను ఇప్పుడే ప్ర‌క‌టించారు. వ‌చ్చే ద‌స‌రాకు సింగ‌రేణి కార్మికుల‌కు రూ. 700 కోట్ల బోన‌స్ ఇస్తామ‌ని ప్ర‌కటించారు. మంచిర్యాల జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. సంక్షేమంలో బాగున్నాం. వ్య‌వ‌సాయంలో బాగున్నాం అని కేసీఆర్ తెలిపారు. సింగ‌రేణి సోద‌రులు కూడా చాలా మంది ఈ స‌భ‌లో ఉంటారు. సింగ‌రేణి 134 ఏండ్ల చ‌రిత్ర ఉంది. వాస్త‌వానికి అది మ‌న‌కు సొంత ఆస్తి. నిజాం కాలంలో ప్రారంభ‌మైంది. వేలాది మందికి అన్నం పెట్టింది. కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో సింగ‌రేణిని స‌ర్వ‌నాశ‌నం చేసింది. కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చింది. అప్పు తిరిగి చెల్లించ‌క‌, మ‌న సొంత‌దైన కంపెనీని.. కేంద్ర ప్ర‌భుత్వానికి 49 శాతం వాటా కింద అమ్మేసింది. ఆ విధంగా సింగ‌రేణిని పూర్తిగా నాశ‌నం చేసింది అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.
2014 కంటే ముందు కార్మికుల‌కు ఇచ్చే బోన‌స్ 18 శాతం మాత్ర‌మే అని కేసీఆర్ గుర్తు చేశారు. అంటే కేవ‌లం రూ. 50 నుంచి 60 కోట్లు మాత్ర‌మే కార్మికుల‌కు పంచేది. తెలంగాణ వ‌చ్చాక సింగ‌రేణి న‌డ‌క మారింది. 2014లో సింగ‌రేణి ట‌ర్నోవ‌ర్ రూ. 11 వేల కోట్లు మాత్ర‌మే. ఇవాళ అదే సింగ‌రేణి ట‌ర్నోవ‌ర్‌ను రూ. 33 వేల కోట్ల‌కు పెంచుకున్నాం. అదే విధంగా సింగ‌రేణి లాభాలు కేవ‌లం రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మాత్ర‌మే ఉండే. ఇవాళ సింగ‌రేణిలో ఈ ఏడాది వ‌చ్చిన లాభాలు రూ. 2,184 కోట్లు. వ‌చ్చే ద‌స‌రాకు సింగ‌రేణి కార్మికుల‌కు పంచ‌బోయే బోన‌స్ రూ. 700 కోట్లు. సింగ‌రేణిలో నూత‌న నియామ‌కాలు చేసుకుంటున్నాం. పదేండ్లు కాంగ్రెస్ సామ్రాజంలో 6453 ఉద్యోగాలు మాత్ర‌మే ఇచ్చారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత డిపెండెంట్ ఉద్యోగాల హ‌క్కును పునుద‌ర్ధ‌రించి 19,463 ఉద్యోగాల‌ను క‌ల్పించాం. 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు క‌ల్పించాం అని కేసీఆర్ గుర్తు చేశారు. సింగ‌రేణిలో ప్ర‌మాదం జ‌రిగి కార్మికులు చ‌నిపోతే గ‌త ప్ర‌భుత్వాలు రూ. ల‌క్ష ఇచ్చి చేతులు దులుపుకునేది అని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌లు ఇస్తుంది అని తెలిపారు. వ‌డ్డీ లేకుండా రూ. 10 ల‌క్ష‌ల రుణం ఇంటి కోసం ఇస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.

Spread the love