తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కడం కాంగ్రెస్‌ కే అలవాటు

–  తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టూరిస్టుల మాదిరి తెలంగాణకు రావడం… అబద్దపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్‌ నేతలకు అలవాటేనని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ విమర్శించారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కాలని చూడడం తరువాత ప్రజలను విస్మరించడం కాంగ్రెస్‌ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పించన్లు రూ. వెయ్యి సైతం ఇవ్వడం లేదని అలాంటిది తెలంగాణలో రూ. 4 వేల పింఛన్లు ఏవిధంగా ఇస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొన్నటికి మొన్న కర్నాటకలో ఉచిత బియ్యం అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్‌ నేడు ఉచిత బియ్యం ఇవ్వడం కుదరదని చేతులెత్తెసిందని వివరించారు. 2019 ఎన్నికల్లో 6వేల పింఛన్‌ ఇస్తానన చెప్పిన కాంగ్రెస్‌ పార్టీని ఇంటికి పంపించారని అదే ఇప్పుడు 4 వేలు ఇస్తానంటే తెలంగాణ ప్రజలు లా నమ్ముతారని ప్రశ్నించారు. అడ్డగోలుగా హామీలు ఇవ్వడం తరువాత వాటిని విస్మరించడం దశాబ్దాలుగా కాంగ్రెస్‌ అనుసరిస్తున్న సూత్రమన్నారు. ఎన్నో కుంభకోణాలు కాంగ్రెస్‌ పాలనలోనే జరిగాయని అలాంటి పార్టీ అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించనట్లే ఉందని ఎద్దెవా చేశారు.

Spread the love