ప్రభుత్వ వైఫల్యాలు నిరసిస్తూ కాంగ్రెస్ నిరసన దీక్ష

– వరద సమస్యకు పరిష్కారం చూపడంలో సర్కార్ విఫలం
– ఎస్ఎన్డీపీ పనుల జాప్యంపై కాంగ్రెస్ ఆగ్రహం
– బీఅర్ఎస్ పోయే రోజులు దగ్గర పడ్డాయి
– టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్: 2020 అక్టోబర్ లో వచ్చిన వరదల వలన జరిగిన ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా రూ.110 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎస్ఎన్డీపీ పనులను పూర్తి చేయడంలో రాష్ట్ర సర్కార్ వైఫల్యం చెందిందని టి.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో ముంపు ప్రాంతాల సమస్యకు పరిష్కారం చూపేందుకు గాను రూ.110 కోట్లతో నిర్మించేందుకు గాను ఎస్ఎన్డీపీ పనులకు 2022 ఫిబ్రవరిలో రాష్ట్ర మునిసిపల్ మంత్రి కేటీఅర్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పనులు రెండు సంవత్సరాలు కావాస్తున్న ఇప్పటికీ పూర్తి చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం నాడు ఉప్పల్ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షకు ముఖ్య అతిధిగా తోటకూర వజ్రేష్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ శంకుస్థాపన చేసే సమయంలో హంగు ఆర్భాటాలతో ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన మంత్రులు కేటీఅర్, మల్లారెడ్డిలు ప్రారంభించి రెండేండ్లు గడిచిన ఎందుకు పూర్తి చెయ్యలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యపై బీఅర్ఎస్ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.మళ్ళీ వరదలు వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాడుతారని జరిగే నష్టాలకు ఎవరూ బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఈ దీక్షలో జంట కార్పొరేషన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.