భారత రాజ్యాంగం ఒక జీవన విధానం

– సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి
– ఘనంగా ప్రారంభమైన ఐలూ రాష్ట్ర 3వ మహాసభ
– జెండాను ఆవిష్కరించిన సీనియర్‌ న్యాయవాది కొత్త బుచ్చిరెడ్డి
– 400 మంది ప్రతినిధులు హాజరు
నవతెలంగాణ -భువనగిరి
భారత రాజ్యాంగం కేవలం లిఖితపూర్వకమైన డాక్యుమెంటే కాదు.. అది ఒక జీవన విధానమని, భారతదేశం ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన అని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏ.అనంతరెడ్డినగర్‌, కొండపల్లి ఉత్తమ కుమార్‌(దీప్తి హోటల్లో) ప్రాంగణంలో శనివారం ఐలూ రాష్ట్ర అధ్యక్షులు జె.విద్యాసాగర్‌ అధ్యక్షతన ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మూడో మహాసభ ప్రారంభ మైంది. ముందుగా అఖిలభారత న్యాయవాదుల సంఘం జెండాను సీనియర్‌ న్యాయవాది, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు కొత్త బుచ్చిరెడ్డి ఆవిష్కరిం చారు. అనంతరం సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి సాధారణ వృత్తి కాదన్నారు. రాజ్యాంగంలో రాసిన.. పేర్కొనబడిన ఏకైక వృత్తి అని తెలిపారు. న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్లో ఎంటర్‌ అయినప్పుడు చేసిన శపథం మరోసారి అందరం చదువుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగంలోని పౌర హక్కులు, చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉందని, ఇది ఉన్నతమైన వృత్తి అని చెప్పారు. ఈ మహాసభలో యూనియన్‌ ఆల్‌ ఇండియా కార్యదర్శి సురేంద్రనాథ్‌, ఆహ్వాన సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, ఏఐఎల్‌ రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్‌, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శులు కొల్లి సత్యనారాయణ, నర్రా శ్రీనివాసరావు, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడి వెంకటరెడ్డి, ఎండి ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఐలూ రాష్ట్ర మహాసభ
ఐలూ రాష్ట్ర మహాసభ ప్రాంగణంలో భువనగిరి చరిత్రకు సంబంధించిన సుమారు 60 కటౌట్లను ఏర్పాటు చేశారు. న్యాయవాదుల హక్కులు, డిమాండ్లు, కక్షిదారుల ఇబ్బందులకు సంబంధించిన ప్రచురణలను ప్రదర్శించారు. అవి న్యాయవాదులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ చిత్రకారుడు చంద్రకుమార్‌ వాటిని తయారు చేశారు.

Spread the love