చిట్టెలుక ధైర్యం

చిత్రారణ్యానికి సింహం రాజు. దానికి ఒక కొడుకు. సింహానికి కాలంగడిచే కొద్దీ వృద్ధాప్యం ముంచుకొచ్చింది. ఎప్పుడు ముసలిరాజు పదవినుంచి తప్పుకుని యువరాజును రాజుగా పట్టాభిషేకం చేస్తాడా అని అడవిలోని జంతువులన్ని ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ముసలిరాజు దగ్గర పదవుల్లో వున్నవారందరూ ఆయనకు సన్నిహితులు, వయసు పైబడినవారు. యువరాజు రాజయితే అతని మిత్రులకు కొందరికి మంచి పదవులొస్తాయని వారి ఆశ. ఆ ముందుచూపుతోనే కొన్ని జంతువులు యువరాజుతో చనువుగా వుంటున్నాయి. కానీ ఎంతకాలం గడిచినా ముసలిరాజు యువరాజును రాజుగా ప్రకటించడం జరగలేదు. ఇక లాభం లేదనుకుని అడవిజంతువులు, పక్షులు మంత్రి నక్కతో ”మనరాజుగారికి వయసు ముంచుకొచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. యువరాజుకు పట్టంకట్టి ఆయన విశ్రాంతి తీసుకోవచ్చు కదా! ఆయన బాగా ఆరోగ్యంగా వుండగానే ఆ వేడుక జరిగితే ఆయనా ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూసినవాడవుతాడు. ఇలాంటివి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. అందుకే పెద్దలు శుభస్యశీఘ్రం అన్నారు” అంటూ తమ కోరికను తెలిపాయి. వాటి తొందర, కోరికా నక్కకు అర్థమయ్యాయి. ”మీ అభిప్రాయం సరయినదే. నేను రాజుగారితో మీకు సమావేశం ఏర్పాటు చేస్తాను. అప్పుడు మీరు మీ అభిప్రాయం విన్నవించుకోండి” అన్నది నక్క. తొందరలో సరిగా ఆలోచన చేయకుండానే సరేనన్నాయి జంతువులు, పక్షులు. ఎవరు ముందుండి రాజుతో ఈ విషయం చెప్పాలి? అన్న ఆలోచనవారికి ఆ సమయంలో తట్టలేదు. తరువాత కొద్దిరోజులకే మంత్రి నక్క సింహంతో ఆ విషయాన్ని చెప్పి అడవిజంతువులకు, పక్షులకు రాజుతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది” మీరు నాతో మాట్లాడాలన్నారట కదా. అది ఏమిటో చెప్పండి” అంది సింహం. జంతువుల గుండెలు జారిపోయాయి. ఆయనతో మాటలాడాలంటేనే భయం. అందులోను ఇలాంటి సున్నితమైన విషయం మాట్లాడాలంటే వాటికి గొంతు పెగల్లేదు. మంత్రి నక్క ఏదో మాట్లాడి కార్యం చక్కబెడుతుందనుకుంటే దాన్ని తమ మెడలకే చుట్టి తమాషా చూస్తుందేమిటి? అని ఆలోచనలో పడ్డాయి. మంత్రి నక్క ”మీ కోరిక ఏమిటో ప్రభువుతో చెప్పండి” అంటూ ఒకటికి రెండుసార్లు చెప్పినా అవి నోరు విప్పలేదు.
”సరే అయితే మీరేమీ మాటలాడటం లేదు గనక సమావేశం ముగిద్దాం” అంటూ సింహం లేవబోయింది. అప్పుడు ఆశ్చర్యంగా ముందుకొచ్చి చిట్టెలుక, ”ప్రభూ!ఆగండి. నేను చెపుతాను.. మీకు వయసు పైబడింది. యువరాజుకు పట్టాభిషేకం చేస్తే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అదే ఇక్కడ చేరినవారందరి అభిప్రాయం” అన్నది ధైర్యంగా.
”భేష్‌, అది చెప్పడానికి భయందేనికి? యువరాజు కు పట్టం కట్టి విశ్రాంతి తీసుకోవాలని నాకూ వుంది. సమయం కోసం ఎదురు చూస్తున్నానంతే. ఇప్పుడు మీరు అడిగారు గనక త్వరలోనే ఆ పనిచేస్తాను. అయితే ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. మంచిపని చేయాలని అనుకున్నపుడు ముందుండాలి. చెడుపనికి ఎపుడూ దూరంగావుండాలి. యువరాజుకు పట్టం కట్టండి అని నాతో చెప్పడానికి మీరు వెనకడుగు వేయడం నాకు నచ్చలేదు. ఎవరైనా మనసులో వున్నది వున్నట్టు కపటం లేకుండా ధైర్యంగాచెప్పగలగాలి.
మరొక విషయం ఏమంటే మనపనులను ఎవరితోనో మాట్లాడించి చక్కబెట్టుకోవాలని అనుకోకూడదు. వీలున్నంతవరకు మనమే మాట్లాడుకుని నెరవేర్చుకోవాలి. మరీ అవసరం అయితే తప్ప ఇతరులమీద ఆధార పడకూడదు. మన పనులకు ఇతరులను ముందుకు నెట్టి మనం వెనక వుండకూడదు. అది తెలివిఅనో, లౌక్యం అనో అనుకొంటే పొరపాటే. చిన్ని ప్రాణి అయినా చిట్టెలుక ఉన్నదున్నట్టు చెప్పింది. దాని ధైర్యం, చొరవ, నిజాయితీ నాకు బాగా నచ్చాయి” అంటూ చిట్టెలుకను ప్రశంసించింది. అంతేగాక యువరాజుకు పట్టాభిషేకం అయ్యాక యువరాజు సలహాదారుల్లో ఒకరిగా చిట్టెలుకను నియమించింది. యువరాజు మిత్రులను పరీక్షించి తగినవారిని మంచి పదవుల్లో నియమించింది సింహం. తరవాత చిట్టెలుకను ఆదర్శంగా తీసుకుని అడవి జంతువులు, పక్షులు మనసులో వున్నవిషయాన్ని నిర్భయంగా చెప్పడం, నిజాయితీగా బతకడం అలవాటు చేసుకున్నాయి.
– డా||గంగిశెట్టి శివకుమార్‌

Spread the love