మ్యాన్‌హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు…

నవతెలంగాణ – హైదరాబాద్
గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. గురువారం ఖైరతాబాద్‌ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఎండీ దానకిశోర్‌ సమీక్ష నిర్వహించి సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ సమయంలో కలుషితనీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎండీ అధికారులకు సూచించారు. తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్‌ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. తరచూ సీవరేజీ ఓవర్‌ఫ్లో అయ్యే మ్యాన్‌హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఎండీ చెప్పారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. మ్యాన్‌హోళ్ల మూతలు తెరవడం జలమండలి యాక్ట్‌లోని 74వ సెక్షన్‌ ప్రకారం నేరమని, అతిక్రమిస్తే.. క్రిమినల్‌ కేసులు నమోదవుతాయని ఎండీ హెచ్చరించారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్‌ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబర్‌ 155313కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే 22వేలకు పైగా మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేసినట్లు ఎండీ తెలిపారు. లోతు ఎక్కువ ఉన్న మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, జీహెచ్‌ఎంసీ వాటర్‌ లాగింగ్‌ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. తీసిన వ్యర్థాలను (సిల్ట్‌) వెంటనే తొలగించాలని, తాగునీటి పైపులైన్‌ నాలా క్రాసింగ్‌ వద్ద చెత్త చేరకుండా అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. ముంపునకు గురైన మ్యాన్‌హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.