సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన సీఎస్‌బీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమి సత్తాచాటింది. మరోసారి విజయకేతనం ఎగురవేసింది. సివిల్స్‌ మెంటర్‌, ఐఏఎస్‌ మల్లవరపు బాలలత ఆధ్వర్యంలోని ఈ అకాడమికి ఈ ఏడాది ర్యాంకుల పంట పండింది. గతంకంటే ఈసారి ఎక్కువ ర్యాంకులను సాధించడం గమనార్హం. 18 ర్యాంకులను సీఎస్‌బీ అకాడమి విద్యార్థులు సాధించినట్టు తెలుస్తున్నది. అందులో 22, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో బాలలత మాట్లాడుతూ జాతీయ స్థాయి పరీక్షల్లో తెలుగు విద్యార్తులు సత్తాచాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తమ అకాడమి ద్వారా ఏడెనిమిదేండ్లలో సుమారు వంద మందికిపైగా సివిల్‌ సర్వెంట్లను దేశానికి అందించామని వివరించారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మంది సివిల్‌ సర్వెంట్లను దేశానికి అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ర్యాంకులు పొందిన పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ శిక్షణ సమయంలో బాలలత మెళకువలు ఎంతో ఉపయోగపడ్దాయని అన్నారు. ఆమె విలువైన సూచనలు, సలహాల వల్ల సివిల్స్‌ ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్నలను సైతం విజయవంతంగా ఎదుర్కొన్నామని వివరించారు. ఇప్పుడు ర్యాంకులు పొంది విజేతలుగా నిలిచామని చెప్పారు.
సివిల్స్‌లో ప్రథమ ర్యాంకు పొంది ప్రజ్ఞ ఐఏఎస్‌
యూపీఎస్సీ ప్రకటించిన సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులను ప్రజ్ఞ గ్రూప్‌ ఆఫ్‌ ఐఏఎస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సాధించింది. మొత్తం 73 మంది సివిల్స్‌ అర్హత సాధించారని ఆ సంస్థ చైర్మెన్‌ పి తేజ్‌ స్వరూప్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్స్‌ ర్యాంకుల్లో టాప్‌టెన్‌లో ఇద్దరు, వందలోపు ర్యాంకుల్లో 13 మందితోపాటు మరో 58 మంది తమ విద్యార్థులే ఉన్నారని వివరించారు. ప్రథమ ర్యాంకు ఇషిత కిషోర్‌, ద్వితీయ ర్యాంకు గరిమా లోహియాకు అభినందనలు తెలిపారు.ప్రిలిమినరీ స్థాయి నుంచే మెయిన్స్‌ లక్ష్యంతో శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థులను సన్నద్ధం చేయడం తమ ప్రత్యేకత అని తెలిపారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు మాజీ సభ్యులతో అభ్యర్థులకు శిక్షణ, సలహాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు బెంగళూర్‌, పూణే, తిరుపతి, ఢిల్లీ కేంద్రాల్లో తమ బ్రాంచీల్లో విద్యార్థులకు శిక్షణిస్తున్నామని వివరించారు.

Spread the love