కేరళలో క్షీరవిప్లవం

– దేశంలోనే అత్యంత నాణ్యమైన పాలుగా ‘మిల్మా’ ఘనత
– కేంద్ర పశుసంవర్ధక, డైరీ శాఖ పరీక్షలో వెల్లడి
– ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ చొరవతో ప్రగతిపథాన పాడి, పౌల్ట్రీ రంగాలు
తిరువనంతపురం : కేరళలో పాడి, పౌల్ట్రీ పరిశ్రమలు ప్రగతిపథాన దూసుకెళ్తున్నాయి. సహకార రంగానికి మారుమేరుగా బాసిల్లే కేరళలో పాడిపరిశ్రమలోనూ బలోపేతమైన సహకార రంగంతో క్షీరవిప్లవం నడుస్తోంది. నాణ్యమైన పాలు, నాణ్యమైన కోడి మాంసం, కోడి గ్రుడ్లు ఉత్పత్తిదారుగా కేరళ దేశానికే మకుటాయమానంగా నిలుస్తోంది. వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలతో కేరళ పశుసంవర్ధక, డైరీ రంగాలు దేశానికే ఆదర్శనీయమైన రీతిలో అభివృద్ధి సాధిస్తున్నాయి. కేరళ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (మిల్మా) కింద పనిచేస్తున్న మలబార్‌ ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం (ఎంఆర్‌సిఎంయు) సేకరిస్తున్న పాలు దేశంలోనే అత్యంత నాణ్యమైన పాలుగా కేంద్ర పశుసంవర్ధక, డైరీ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఇది వామపక్ష ప్రభుత్వ సహకారంతో మలబార్‌ పాడి పరిశ్రమ రైతులు సాధించిన విజయమని మిల్మా ఛైర్మన్‌ కెఎస్‌ మణి హర్షం వ్యక్తం చేశారు. 2022-23లో మలబార్‌ పాడి రైతులకు పాల సేకరణ కింద రూ.1041.47 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. అలాగే పాడి రైతుల సంక్షేమం కోసం రూ.7.7 కోట్లతో సంక్షేమ నిధి కూడా మిల్మా ఏర్పాటు చేసిందన్నారు. దాణా రాయితీ కింద మరో రూ.7.65 కోట్లు రైతులకు అందజేసిందని తెలిపారు. దీంతో పాటు పాడి రైతులను ప్రోత్సహించేందుకు అదనపు పాల ధర కింద రూ.29.16 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే పాడి రైతుల ఆరోగ్యం కోసం గ్రూపు ఇన్సూరెన్స్‌గా రూ.15.01 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
ఎంబీఆర్‌టీ పరీక్షలో 204 నిమిషాలు
పాల నాణ్యత కోసం మిథైలీన్‌ బ్లూ డై రిడక్షన్‌ టెస్ట్‌ (ఎంబీఆర్‌టీ) పరీక్ష నిర్వహిస్తారు. నమూనాగా తీసుకున్న పాలలో మిథైలీన్‌ నీలి రంగు కలుపుతారు. పాలలో ఆ రంగు ఎంత ఎక్కువ సమయం రంగు వెలిసిపోకుండా ఉంటే పాలు అంత నాణ్యమైనవిగా పరిగణిస్తారు. ఈ పరీక్షలో మిల్మా పాలు 204 నిమిషాలు రంగు వెలిసిపోకుండా ఉన్నాయి. దేశంలో ఇతర అన్ని ప్రాంతాల్లో సేకరించిన పాలు కంటే ఇదే అత్యధికం. అంటే అత్యంత నాణ్యమైనవని కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంబిఆర్‌టి పరీక్షలో 236 నిమిషాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటన్నట్లు మిల్మా ఛైర్మన్‌ మణి చెప్పారు. ఎంబిఆర్‌టి పరీక్షలో కేరళ తర్వాత స్థానాల్లో కర్ణాటక (190 నిమిషాలు), పంజాబ్‌ (180 నిమిషాలు) పాలు నిలిచాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సేకరిస్తున్న పాల నాణ్యత 30 నిమిషాల వద్దే ఆగిపోయింది.
దీంతో పాటు పాడి పరిశ్రమ ఆధునీకరణలోనూ ప్రత్యేకించి ప్యాకేజీ, డిజిటలీకరణ విషయాల్లో కేరళ ఘననీయమైన ప్రగతి సాధిస్తోంది. కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘క్షీరశ్రీ’ వెబ్‌ పోర్టల్‌కు 2022లో కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా – 2022 సిల్వర్‌ మెడల్‌ అవార్డుతో సత్కరించింది. మిల్మా ఉత్పత్తులన్నిటికీ ఏకీకృత ప్యాకేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి పాల ఉత్పత్తుల్లో నకిలీకి తావు లేకుండా చేశారు. పౌల్ట్రీ రంగంలోనూ కేరళ అధునాతన విధానాలతో ముందుకెళ్తోంది. చికెన్‌ ఫింగర్‌, చికెన్‌ బర్గర్‌ ప్యాటీ, చికెన్‌ నగెట్స్‌ వంటి మాంసం ఉత్పత్తులకు వేల్యూ యాడెడ్‌ ప్లాంటు నెలకొల్పి పౌల్ట్రీ రైతులకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చేయూతనందిస్తోంది. గొర్రెలు, ఇతర పశు సంపద పరిరక్షణ కోసం అత్యాధునిక మొబైల్‌ వెటర్నీరీ క్లినిక్‌ల ద్వారా సేవలందిస్తోంది. ‘గోవర్ధిని’ పథకం కింద 42,747 దూడలకు శాస్త్రీయ చికిత్సలు అందించారు. లంపీ చర్మవ్యాధి రాకుండా 9,14,871 పశువులకు టీకాలు వేశారు. కేరళ చికెన్‌ కూడా అత్యంత నాణ్యమైన చికెన్‌గా వివిధ సంస్థలు ధ్రువీకరించాయి. ప్రతి రోజు ఔట్‌లెట్ల ద్వారా నాణ్యమైన 24 వేల కిలోల చికెన్‌ అమ్మకం జరుగుతోంది.
కేరళ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (కేఈపీసీఓ) సహకారంతో అమల్జేస్తున్న ‘ఆశ్రయ’ పథకం కింద వితంతువులకు ఆర్థిక చేయూతనందించి పాడి పరిశ్రమలో ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే షెడ్యూలు తెగలకు చెందిన లబ్దిదారులకు 100 చొప్పున కోళ్లు, వాటికి సరిపడా దాణా అందించి బడుగు జీవులకు వామపక్ష ప్రభుత్వం మెరుగైన జీవనాన్ని అందిస్తోంది. ‘వనితా మిత్రం’ అనే మరో పథకం కింద ‘కుడుంబశ్రీ’ సభ్యులకు, వారి పిల్లలకు పౌల్ట్రీ రంగంలో శిక్షణ అందిస్తున్నారు. మేకల శాటిలైట్‌ పథకం కింద 700 యూనిట్లు నెలకొల్పారు. వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలలో ఇటు పాడి పరిశ్రమలోనూ అటు అనుబంధ పౌల్ట్రీ, పశుపోషణ రంగాల్లోనూ కేరళ ముందడుగేస్తోంది.

Spread the love