దండి సత్యాగ్రహం అహ్మదాబాద్

ఉప్పు సత్యాగ్రహానికీ, దండి యాత్రకూ, అరవై వేల మంది అరెస్టుకూ కేంద్ర బిందువైన అహ్మదాబాద్‌ నగరాన్ని చూడటానికి ఫిబ్రవరి నెల 19వ తేదీన బయలుదేరాం. హైదరాబాదు నుండి అహ్మదాబాదుకు ఎయిర్‌ జర్నీ రెండు గంటలు పట్టింది. సర్దార్‌ వల్లభారు పటేల్‌ విమానాశ్రయంలో రాత్రి 11 గంటలకు దిగాం. అక్కడ మేం ఐటిసి నర్మద అనే హోటల్లో దిగాం. ఈ హోటల్‌లో 30 ఫ్లోర్లున్నాయి. హోటల్‌కు వెళ్ళే దారంతా ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు కనిపించాయి. ఊరి మధ్యలో సబర్మతీ నది పారుతూ ఉన్నది. సబర్మతీ నది మీదున్న బ్రిడ్జి మీద వాహనాలు వెళ్తుంటే ఆ లైట్ల వెలుతురు లో నదిలోని నీళ్ళు చమక్‌ చమక్‌ మని మెరుస్తున్నాయి. నదికి తీరం వెంట బీచ్‌లు కూడా ఉన్నాయట. సాయంత్రాలు జనమంతా అక్కడ కూర్చుని చల్లని గాలులు ఆస్వాదిస్తారని డ్రైవరు చెబుతుంటే రేపంతా ఇవన్నీ చూసేయాలి అనుకున్నాం.
అహ్మదాబాద్‌లో జాతీయ శిశువైద్యనిపుణుల సమావేశం తిరుగుతున్నది. ఈ సమావేశాలకు డాక్టర్లు తమ కుటుంబాలతో వస్తారు. సంవత్సరమంతా బిజీబిజీగా గడిపే డాక్టర్లకు ఇదొక పండుగ వాతావరణం. దేశం నలు మూలల నుంచీ డాక్టర్లు భార్యా పిల్లలతో రావడం వల్ల అన్ని రాష్ట్రాల సంస్కతి వేషభాషలు కనిపిస్తాయి. అక్కడ ఉండే నాలుగైదు రోజుల్లో అన్ని భాషలూ చెవికి పసందుగా వినిపిస్తుంటాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వస్త్రధారణతో మహిళలు పిల్లలు తిరుగుతుంటే, ప్యాషన్‌ పెరేడ్‌ దీని ముందు దిగదుడుపే అనిపిస్తుంది. కనులకు, చెవులకు, నోటికి మనసుకు అన్నిటికీ విందూపసందూ. గాంధీనగర్‌ లోని సాల్ట్‌ మౌంటు రోడ్డులో ఉన్న మహాత్మా మందిర్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో మా సమావేశాలు నిర్వహించారు. సుదూరు ఐదారు వందల స్టాల్స్‌తో ఏడెనిమిది వేల మంది డాక్టర్లతో ఆ ఎగ్జిబిషన్‌ సెంటరంతా కళకళలాడిపోయింది. కరోనా దెబ్బకు రెండు మూడేళ్ళు ఎక్కడికీ వెళ్ళకపోయేసరికి ఎక్కువ మంది జనాలను ఒకేచోట చూస్తుంటే కడుపు నిండిపోయింది.
ఫార్మసీ స్టాల్స్‌లో రకరకాల ఫొటోలు తీస్తూ అందర్నీ ఉత్సాహ పరుస్తుంటారు. మందుల పేర్లతో మన ఫొటోలు వచ్చేలా డిజైన్‌ చేశారు. మరోచోట పెయింటింగ్‌ చేసినట్లుగా ఫొటో వచ్చింది. మరొకచోట నూలు వడికే రాట్నం పెట్టారు. గాంధీ టోపీని ఇచ్చారు. చక్కగా గాంధీ టోపీని పెట్టుకుని రాట్నం వడుకుతూ ఫొటో తీసుకున్నాం. నేనొక వీడియో కూడా తీసుకున్నాను. నేను వడికిన దారాన్ని కూడా నాకే ఇచ్చారు. పత్తి నుండి తీసిన దారాన్ని ఒక ప్యాకెట్‌ లో పెట్టి ఇచ్చారు. నేను దానితో గాంధీజీ రేఖా చిత్రాన్ని చేయాలని దాచిపెట్టాను. జీవితాంతం జ్ఞాపకంగా దాచుకోవాలని అనుకున్నాను.
మా సమావేశం జరిగే స్థలమేమో గాంధీనగర్‌. మేం తీసుకున్న హోటలేమో అహ్మదాబాద్‌లో. ఈ రెండింటికీ మధ్య 30 కి.మీ దూరమున్నది. అహ్మదాబాద్‌ ను ‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు. ఈ నగరాన్నీ ‘సుల్తాన్‌ అహ్మద్‌ షా’ సబర్మతి నది ఒడ్డున నిర్మించాడట. బహుశ ఆయన పేరుతోనే అహ్మదాబాద్‌ అని ఈ నగరానికి పేరు వచ్చి ఉండవచ్చు. 1411 వ సంవత్సరంలో దీనికి శంకుస్థాపన చేసిన ప్రదేశం ‘ఏలెస్‌ బ్రిడ్జి’ అనే ప్రదేశంలో ఉన్నది. ఈ నగరంలో ఎన్నో పురాతన పాత కట్టడాలున్నాయని డ్రైవరు చెప్పాడు. గానీ చూడలేకపోయాం.
గుజరాత్‌ రాష్ట్రానికి రాజధాని గాంధీనగర్‌. ఇక్కడే అక్షరధామ్‌ ఆలయం ఉన్నది. మేం మీటింగ్‌ ముగించుకుని బయటకు వచ్చేసరికే ఐదు గంటలయింది. అప్పటికి అక్షరధామ్‌ ఆలయం మూసేశారు. ఇంతకు పూర్వం ఢిల్లీలో చూశాం కదా అని తప్తి పడ్డాం.

గాంధీనగర్‌ ను డిజైన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌ లు భారతీయులే. కార్రెల్‌ యూనివర్శిటీలో చదువుకున్న న.ఖ మేవాడా ఒకరు. మరొకరు ప్రకాష్‌ ఎమ్‌ ఆప్టే. ఈ ఇరువురూ గాంధీనగరానికి ప్లాన్‌ ఇచ్చారు. ఇక్కడ ఉన్న మహాత్మా మందిర్‌ అద్భుతంగా ఉన్నది. రోడ్డుకు ఒకవైపు మహాత్మా మందిర్‌, మరొక వైపు ఎగ్జిబిషన్‌ సెంటర్‌ ఉన్నాయి. రెండింటినీ కలుపుతూ రోడ్డు పై భాగాన వాక్‌ బ్రిడ్జ్‌ ఉన్నది.
మొదటగా సబర్మతీ నది వద్దకు వెళ్ళాం. అక్కడ బీచ్‌ లో తిరుగుతూ ఆ నీళ్ళలో కాళ్ళు తడుపుకున్నాం. పైభాగాన ‘రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌’ అని ఉన్నది అక్కడ చెట్లు, ఉద్యానవనం ఉన్నాయి కొద్ది దూరం నడిచి టైం లేదని బయటికి వచ్చేశాం. ఇక్కడే ఒక బ్రిడ్జ్‌ ఉన్నది. చాలా సుందరంగా కట్టారు. దీన్ని ‘ అటల్‌ బ్రిడ్జ్‌’ అంటారు సబర్మతీ నదిని ఈ చివర నుంచి ఆ చివర దాకా కలుపుతూ ఉన్నది ఈ బ్రిడ్జ్‌ కేవలం సందర్శకులకు మాత్రమే. దీని మీద వాహనాలు తిరగవు బ్రిడ్జి మీద మొత్తం చిరుతిళ్ళ బండ్లు, చిన్న చిన్న హోటల్సు ఉంటాయి. పిల్లా పాపలతో వచ్చే వారికి నచ్చిన తినుబండారాలన్నీ దొరుకుతాయి. మేం కూడా మిరపకాయ బజ్జీలు, ఐస్‌ క్రీములు తిన్నాం. హోటళ్ళ ముందున్న బెంచీల మీద కూర్చుని నది మీద నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదించాం. బ్రిడ్జి మీద వర్షం పడకుండా కప్పు ఉన్నది. దాన్నే అందంగా డిజైన్‌ చేశారు. మేం బ్రిడ్జి మీదున్నప్పుడే చీకటి పడబోతున్నది. అక్కడ నుంచి నగరమంతా లైట్లతో దగద్ధాయమానంగా వెలిగిపోతూ దర్శనమిచ్చింది. అలాగే నది చుట్టూతా ఉన్న ప్రత్యేక లైట్లు వెలుగుతుంటే వాటి కాంతి నీళ్ళలో ప్రతిఫలిస్తూ నీళ్ళు కూడా కాంతిని కప్పుకున్నట్లు కనిపించింది వేరే పార్టీకి వెళ్ళాలని త్వరత్వరగా వెళ్ళిపోయాం.
8 గంటలకు గాలా డిన్నర్‌ ఉన్నది. ఇది ఒవెంటస్‌ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు ‘దలీలా గార్డెన్స్‌’ లో జరుగుతున్నది. ఇది ఏరోస్పేస్‌ వారి రైల్వేస్టేషన్‌ కు పై భాగాన ఉన్నది. అక్కడ సాంప్రదాయ నత్యాలతో పాటు అన్నిరకాల డాన్సులూ ఉన్నాయి. ప్రభ్యాత గాయనీ గాయకులతో పాటలు పాడించారు . నేను వారి పేర్లు మర్చిపోయాను. అందరూ వారికి నచ్చిన ఫుడ్‌ తింటూ పాటలు వింటూ, డాన్సులు చేస్తూ ఎంజారు చేస్తున్నారు. గుజరాతీలు ప్రధానంగా శాఖాహారమే తీసుకుంటారు. సాధారణ భోజనంలో రోట్లీ, భాఖారీ, దాల్‌, కిచిడి, కడి ఎక్కువగా ఉంటాయి. అథాను అనే భారతీయ ఊరగాయను కూడా పెట్టారు. సారాష్ట్ర మ్రంతం వారి ఆహారంలో ‘చాష్‌’ అనే మజ్జిగ ను తప్పనిసరిగా తీసుకుంటారు. అన్ని రాష్ట్రాల వంటకాలు డిన్నర్‌ లో నోరురిస్తూ ఉన్నాయి. కౌంటర్లలో ఆయా రాష్ట్రాల వంటకాలతో బోర్టులు పెట్టి ఉంచడం వలన ఎవరి ఆహారం వారు తీసుకుంటారు. వందల రకాల స్వీట్లను అక్కడే వండుతూ వడ్డిస్తూ ఉంటారు. రోటీలు కూడా స్థానిక మహిళలతో కాల్పిస్తూ వేడి వేడిగా అందిస్తారు. వాళ్ళను చూస్తుంటే ఆహార శాస్త్ర నిపుణలుగా కనిపిస్తారు. ఎన్నోరకాల ఆరోగ్య డ్రింకుల్లో జీలకర్ర, శోంఠీ కలిపినవి అందిస్తారు. పాన్‌లలో కూడా ఐదారు రకాలు లభిస్తాయి. ఇవన్నీ చూస్తుంటే ఈవెంట్‌ మేనేజిమెంట్‌ తక్కువ కాదనిపిస్తుంది.
గుజరాతీ జానపద నత్యాలైన ‘గర్భా’,’ దాండియా’ ఎంత ప్రాచుర్యం పొందాయో మన కందరికీ తెలుసు. మా సమవేశాల్లో గుజరాతీ సంస్కతి సంప్రదాయాలను తెలియజేస్తూ నత్యాలు చేశారు. గుజరాత్‌ అరేబియా సముద్రానికి దగ్గరగా ఉండటం వలన సముద్ర యానం, వాణిజ్యం చేసేవారు, ఎక్కువ గుజరాతీలు ఇండోనేషియాకు, ఫిలిప్పీన్స్‌ లకు వలస వెళుతూ ఉంటారు. అహ్మదాబాద్‌ లో పదమూడు విశ్వవిద్యాలయాలు, నాలుగు అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలు ఉన్నాయి. మేము అహ్మదాబాద్‌ నుంచి గాంధీ నగర్‌ వెళ్ళే దారిలోనే గుజరాత్‌ విశ్వవిద్యాలయాన్ని చూశాం. బయట నుంచే ఎంతో అందంగా కనిపిస్తున్నది. నేషనల్‌ లా యూనివర్శిటీ,  ధీరూభారు అంబానీ ఇనిస్టిట్యుట్‌ ఆఫ్‌ ఇవిఫర్మేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీ వంటి ప్రసిద్ధ కాలేజీలున్నాయి. మా హోటల్‌ కు సరిగ్గా వెనక వైపునే ఐఐఎమ్‌ ఉన్నది. కారు ఆపి ఫొటో తీసుకోవాలనుకున్నాను కానీ మన హోటల్‌ కు పక్కనే ఉన్నది కదా తీసుకోవచ్చులే అని నిర్లక్ష్యం చేస్తే చివరికి టైమే దొరకలేదు. అహ్మదాబాద్‌లోని సైన్స్‌ సిటీ లోపలికెళ్ళి చూడలేకపోయాం. బయటనే ఉన్న రాకెట్‌ మోడలను చూశాం.
అహ్మదాబాద్‌ లోనే ఉన్న అడాలజీకీ వావ్‌ వస్త్రపూర్‌ లేక్‌ ను చూశాం. చిన్నప్పుడు సోషల్‌ టెక్ట్స్‌ బుక్‌లో చదువుకున్నపుడు ప్రసిద్ధమైన సరస్సుల్లో వస్త్రపూర్‌ సరస్సును కూడా చదివాం. కానీ అంత అద్భుతంగా అనిపించలేదు. ఊరి మధ్యలో కొద్ది స్థలంలో పరుచుకుని ఉన్నది. ఒడ్డున అడ్వంచర్‌ పార్క్‌ అని పిల్లలు ఆడుకునే గేమ్స్‌ ఉన్నాయి. ఇక్కడకు దగ్గరలో ‘వన్‌ మాల్‌’ ఉన్నది. తర్వాత హాథీసింగే జైన్‌ టెంపుల్‌ ను చూశాం. తెల్లని పాలరాతితో చెక్కిన ఆలయం నిర్మించారు. అదాలజీ స్టెప్‌ వెల్‌ మాత్రం చాలా బాగుంది. ఇది ఐదు అంతస్థులలో నిర్మించబడింది పక్కనే ఉన్న ఉద్యానవనాలకు నీటి ఏర్పాటు కోసం ఈ భావి ఏర్పాటు చేశారు. దీనిని 1499 లో తవ్వారని అక్కడ ఉన్న రాతిపై చెక్కబడి ఉన్నది. పై భాగాన కొన్ని సమాధులు ఉన్నాయి. బావి వెనుక భాగాన ఒక పెద్ద రాజ భవనం కనిపిస్తున్నది. కింది అంతస్థులో ఉన్న బావిని చేరుకోవటానికి దాదాపు 150 మెట్లు దిగ వలసి వస్తున్నది. నేను మాత్రం 60, 70 మెట్ల దగ్గరే ఆగిపోయాను. మెట్లు చాలా పెద్దగా, ఎత్తుగా ఉన్నాయి అహ్మదాబాద్‌ నుండి గాంధీనగర్‌ వెళ్ళే దారిలో ఎడమవైపు ఒక బాణం గుర్తు వేసి అక్కడ ‘దండీ’ అని రాసి ఉన్నది. అప్పటి దాకా ‘దండి సత్యాగ్రహం ‘ లోని దండి అనేది ఊరి పేరని తెలియదు.
సబర్మతీ ఆశ్రమాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యాం. దక్షిణాఫ్రికా నుంచి గాంధీకి వచ్చాక సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించారట. ఇక్కడ నుంచే సత్యాగ్రహం యాత్ర ‘దండీ’ దాకా కొనసాగింది.ఆ సమయంలో అరవై వేల మంది సత్యాగ్రహులు అరెస్ట్‌ అయ్యారు. మహాత్మాగాంధీ జన్మ రాష్ట్రంలో అడుగుపెట్టాననీ ఆయన నిర్మించుకున్న సబర్మతీలో నేను కూడా పాదం మోపాననీ ఎంతో సంతోషపడ్డాను. మా నాన్న స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నపుడు గాంధీని చూశారని, మా నాన్నమ్మ తన బంగారం కూడా ఉద్యమంలో ఇచ్చిందని చెప్తుంటే విని రోమాలు నిక్క బొడుచుకునేవి. అలాగే నేను దక్షిణాఫ్రికా వెళ్ళినపుడు గాంధీజీని నిర్బంధించిన జైలునూ, ఆయనను బలవంతంగా రైలు నుండి దింపేసిన స్టేషన్‌నూ చూశాను. ఇక్కడ ఆయన జన్మస్థలమైన పోరుబందరును చూడాలనుకుని చూడలేక పోయాం.
చిన్నప్పుడు ఎంతో కష్టపడి నేర్చుకున్న ‘కచ్‌వర్క్‌ ‘ ఈ రాష్ట్రం లోని ‘కచ్‌’ ప్రాంతపు కళ అని తెలిసి ఆశ్చర్యపోయాను. ‘కచ్‌ వర్క్‌’ నేర్చుకోవడాన్ని ఎంతో గొప్పగా భావించేవారు. ఇక్కడ లిప్పన్‌ ఆర్ట్‌ కు సంబంధించిన మట్టి ప్లేట్స్‌ను కొనుక్కున్నాను. ఇంటికి వచ్చాక అదేవిధంగా కొన్ని లిప్పన్‌ కళాకతుల్ని తయారు చేశాను. లిప్పన్‌ ఆర్ట్‌ కచ్‌ వర్క్‌, జర్దోసి వర్క్‌ వంటి గుజరాతీ కళలు నాకు వచ్చు అని ఆనందపడ్డాను. అక్కడ కొన్ని గుజరాతీ వాక్యాలు తెలుసుకున్నాను. ‘ఎలా ఉన్నారు?’ అని అడగటానికి ‘కేమ్‌ చో’ అనీ, ‘మీ పేరు ఏమిటి’? అనటానికి ‘తరునామ్‌ సూచె’ అనాలనీ ఇంకా కొన్ని తెలుసుకుని గుజరాతీ వచ్చెసిందని ఎగిరి గంతేశాం. సర్దార్‌ వల్లభారు పటేల్‌ ప్రముఖ శాస్త్రవేత్త, విక్రమ్‌ సారాభారు గుజరాత్‌ రాష్ట్ర వ్యక్తులే. గుజరాత్‌ రాష్ట్రం నుంచి అప్పడాల వంటి ‘కాక్రాలు’ తెచ్చుకున్నాం. ఆ సోపలావ్‌’ అనే హస్తకళల షాపులో ‘బంధేజ్‌ చీర’ ను తెచ్చుకున్నాను. అన్ని రాష్ట్రాల హస్తకళల చీరలు నా దగ్గర ఉన్నాయి. ఇవండీ గుజరాత్‌ రాష్ట్ర సంగతులు.
– కందేపి రాణీప్రసాద్‌
9866160378

Spread the love