దశాబ్ది ఉత్సవాలు సరే కార్మికుల సమస్యల పరిష్కారమేది?

– ఆగస్టు 11న హైదరాబాద్‌లో పోరుగర్జన
– ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యవర్గం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు సరే రాష్ట్రంలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమేదనిరాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర కార్యవర్గం ప్రశ్నించింది. బుధవారం హైదరాబాద్‌ విద్యానగర్‌ లోని మార్క్స్‌భవన్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, ప్రధానకార్యదర్శి కె సూర్యం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. 29 చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చడం వల్ల కార్మికులు నిత్యజీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో ఉద్యోగాలను ఖాళీ చేస్తున్నదని విమర్శించారు. వీఆర్‌ఎస్‌తో ఉద్యోగుల ను ఇంటికి పంపుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు వ్యవస్థను పెంచి పోషిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కూడా సంక్షేమ పథకాల ప్రగల్భాలు పలుకుతూ, మరోపక్క కార్మికవర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు. గ్రామపంచాయతీ, మున్సి పల్‌, మిషన్‌ భగీరథ కార్మికులు వేతనాల సమస్యపై చాలాకాలంగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ఊరేగుతున్నారని విమర్శిం చారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి సంబరా లు చేయాలని డిమాండ్‌ చేశారు. పదేండ్లు పూర్తి కాకున్నా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడంలోనే కేసీఆర్‌ నిజాయితీ తెలుస్తున్నదని విమర్శించారు. కార్మిక సమస్యలపై వచ్చేనెల ఒకటి నుంచి ఆగస్టు 10 వరకు విస్తృతంగా ప్రచారజాత నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 11న హైదరాబాద్‌లో పోరుగర్జన నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెను, మిషన్‌ భగీరథ కార్మికులు నిర్వహించే ఆందోళనలకు మద్దతునిస్తున్నామని ప్రకటించారు.

Spread the love