పవన్‌ కల్యాణ్‌పై పరువునష్టం కేసు

– ఉత్తర్వులు జారీచేసిన అజరుజైన్‌
అమరావతి : వలంటీర్లపై వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పరువు నష్టం కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరుజైన్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. పవన్‌పై కేసు నమోదు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. వలంటీర్లను, ఆ విభాగంలో పనిచేస్తున్న మహిళలను కించపరిచేలా పవన్‌ కల్యాణ్‌ వాఖ్యలు ఉన్నాయని, అవమానకరమైన, విషపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు సెక్షన్‌ 199/4 కింద కేసు నమోదుకు ఆదేశించడంతోపాటు నోటీసును మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో అందించారు. నిరంతరం ఇంటింటికీ తిరిగి సేవలు చేస్తున్న ఈ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 9న ఏలూరులో జరిగిన వారాహి విజయయాత్రలో వలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 29 వేలమంది మహిళలు మిస్సయ్యారని, వారిలో 14 వేలమంది ఆచూకీ ఉందని, మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదని, ఎన్‌సిఆర్‌బి నివేదికలో ఈ విషయాలు తెలిశాయని విమర్శించారు. అలాగే వలంటీర్లు ఇళ్లలోకి వెళ్లి ఒంటరి మహిళల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని, ఈ డేటా ఎవరి వద్దకు వెళుతుందో కూడా తెలియదని పేర్కొన్నారు. అజరు జైన్‌ జారీచేసిన నోటీసులో ఈ అంశాలన్నిటినీ ప్రస్తావించారు. విమర్శలు చేస్తే కేసులు నమోదు చేయడం సరైన పద్ధతి కాదని సీనియర్‌ న్యాయవాదులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేసే హక్కు ఉందని, తప్పని తేలితే చెప్పాలి తప్ప కేసులు నమోదు చేసి వేధించడం సరికాదని పేర్కొన్నారు.
అరెస్టు చేసుకోండి పవన్‌
తాను దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నానని, అరెస్టు చేసుకోవచ్చని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కేసు నమోదు చేసినంత మాత్రాన భయపడేది లేదని అన్నారు. డేటా చౌర్యం ప్రమాదకరమైందని హెచ్చరించారు. సేకరించిన డేటా ఎక్కడకు వెళుతుందో, ఎవరికి చేరుతుందో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలన్నిటినీ కేంద్ర హోంశాఖ దగ్గరకు తీసుకెళతానని పవన్‌ తెలిపారు.

Spread the love