రాజ్యాంగ ధర్మాసనానికి ఢిల్లీ ఆర్డినెన్స్‌ కేసు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఆప్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంచుతామని వెల్లడించింది. ఈ పిటిషన్‌పై తమ వైఖరి తెలియచేయాలంటూ సుప్రీం కోర్టు ఇటీవల కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ అధికారం స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం మే నెలలో కీలక తీర్పు వెలువరించింది. అయితే అధికారాల నియంత్రణ విషయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆప్‌ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా విమర్శించింది. ఆర్డినెన్స్‌ను రద్దు చేయడంతోపాటు దానిపై మధ్యంతర స్టే విధించాలని ‘సుప్రీం’లో పిటిషన్‌ వేసింది. అయితే, మధ్యంతర స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు కేంద్రానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్‌ తిరస్కృతి
అయితే 370వ అధికరణ కేసు కన్నా ముందుగా ఈ పిటిషన్‌ను విచారించాలని, దీనిపై జాప్యం జరిగితే పాలనా యంత్రాంగంలో ప్రతిష్టంభన నెలకొంటుందని ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి పేర్కొన్నారు. ఆయనచేసిన అభ్యర్ధనను చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది.